కూరగాయల మార్కెట్‌లో దొంగ నోట్ల కలకలం!

23-11-2026 | 11:23pm

వృద్ధ చిరువ్యాపారులను లక్ష్యంగా చేసుకుని రూ.50 నకిలీ నోట్ల చలామణి..

ఒకే సీరియల్ నంబర్‌తో 10 నుంచి 15 నోట్లు వెలుగులోకి

బోధన్, నవంబర్ 23 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని గంజ్ కూరగాయల మార్కెట్‌(Vegetable Market)లో నకిలీ నోట్ల చలామణి కలకలం రేపుతోంది. కూరగాయలు కొనుగోలు చేసినట్లు నటిస్తూ నిరుపేద వృద్ధ చిరువ్యాపారులకు రూ.50 నకిలీ నోట్లు అంటగట్టి గుర్తుతెలియని వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే సీరియల్ నంబర్‌తో ముద్రించిన నకిలీ నోట్లు బయటపడటంతో మార్కెట్ వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది.

ఒకే సీరియల్ నంబర్‌తో నకిలీ నోట్లు

గంజ్ మార్కెట్‌లో కూరగాయలు విక్రయించుకుంటూ జీవనం సాగించే వృద్ధ వ్యాపారుల వద్దకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కూరగాయలు కొనుగోలు చేసినట్లు నటిస్తున్నారు. అనంతరం రూ.50 నకిలీ నోట్లను వారికి అందజేసి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. వ్యాపారులు అనుమానంతో నోట్లను పరిశీలించగా అవి నకిలీవని గుర్తించినట్లు సమాచారం. ఇలా సుమారు 10 నుంచి 15 వరకు అనుమానాస్పద రూ.50 నోట్లు వెలుగులోకి వచ్చాయి. వాటన్నింటిపై ఒకే సీరియల్ నంబర్ ఉండటం గమనార్హం.

రూ.50 నోటుతోనూ పేదలకు నష్టం

రోజంతా ఎండనకా, వాననకా కష్టపడి కూరగాయలు విక్రయించే చిరువ్యాపారులను సైతం మోసగాళ్లు వదలకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా కష్టపడితే కేవలం రూ.300 నుంచి రూ.500 వరకు మాత్రమే ఆదాయం వస్తుందని, అలాంటి పరిస్థితుల్లో రూ.50 నకిలీ నోటు చేతికి రావడం కూడా తమకు పెద్ద ఆర్థిక నష్టమేనని బాధిత వృద్ధ వ్యాపారులు వాపోతున్నారు.

నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలి

గంజ్ మార్కెట్‌లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి నకిలీ నోట్ల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించాలని పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుపేద చిరువ్యాపారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేసి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు