చిన్న ఊరు.. పెద్ద సంకల్పం

23-11-2026 | 10:44pm

దేవుడు తండాలో హన్మంతుని గుడి కోసం 29 కుటుంబాల బృహత్తర సంకల్పం 

ఇంటింటి సహకారంతో రూ.3.20 లక్షలతో ఆలయ స్థలం కొనుగోలు.. 

ఆదర్శంగా నిలిచిన తండా ప్రజలు 

కూసుమంచి, నవంబర్ 23 (విజయక్రాంతి): చిన్న గిరిజన తండా.. కేవలం 29 కుటుంబాలు.. కానీ సంకల్పం మాత్రం ఎంతో గొప్పది. అందరూ ఒక్కటైతే ఏదైనా సాధించవచ్చని దేవుడు తండా ప్రజలు నిరూపించారు. గ్రామంలో హన్మంతుని ఆలయం(Hanuman Temple) నిర్మించుకోవాలనే సంకల్పంతో 29 కుటుంబాలు ఏకతాటిపైకి వచ్చి ఆలయ స్థలాన్ని కొనుగోలు చేశారు. కొల్లు బాబూరావు వద్ద నుంచి రూ.3 లక్షల 20 వేలతో స్థలాన్ని కొనుగోలు చేయగా, ఇంటింటికీ రూ.15 వేల చొప్పున గ్రామస్తులు సహకారం అందించారు. చిన్న తండాలోని ప్రతి కుటుంబం ముందుకొచ్చి ఆలయ స్థలం కోసం సహకరించడం గ్రామ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.

 29 కుటుంబాలు.. ఒకే మాట.. ఒకే బాట! 

పెద్ద గ్రామాల్లోనూ సాధ్యం కాని ఐక్యతను కేవలం 29 కుటుంబాలున్న దేవుడు తండా ప్రజలు చాటిచెప్పారు. సంపదలో చిన్నదైనా సంకల్పంలో ఎంతో పెద్దదని నిరూపించారు. ఇదే ఐక్యత, సహకారం గుడి నిర్మాణ సమయంలోనూ కొనసాగితే హన్మంతుని ఆలయ నిర్మాణం సైతం విజయవంతంగా పూర్తవుతుంది. చిన్న తండా అయినా గొప్ప మనసుతో ముందడుగు వేసిన గ్రామస్తుల ఐకమత్యం అభినందనీయం.

ఈ కార్యక్రమంలో వడిత్యా రూప్లా, బాణోతు మోతీలాల్, పాల్తియా బద్దు (బద్రీ), దరావతు రవి, బాణోతు శ్రీను, దరావత్ రాంబాబు, పాల్త్యియా హాము, బదావతు రామకృష్ణ, వడిత్యా శంకర్, బాణోతు రమేష్ తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు