మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం

11-11-2026 | 07:31pm

అదనపు కలెక్టర్ చంద్రయ్య

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి(India's first Minister of Education), స్వాతంత్ర్య సమరయోధుడు, గొప్ప విద్యావేత్త, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్(Bharat Ratna Maulana Abul Kalam Azad) దేశంలో విద్యారంగ అభివృద్ధికి అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు.

బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకలకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, అధికారులతో కలిసి హాజరై ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ విద్యారంగ అభివృద్ధికి పునాదులు వేసిన మహనీయులలో ఒకరని, స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా దేశంలో విద్యావ్యవస్థ బలోపేతానికి విశేష కృషి చేశారన్నారు.

దేశంలోని ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలని, పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో అనేక విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఉన్నత విద్య, సాంకేతిక విద్య, పరిశోధన రంగాల అభివృద్ధికి ఆజాద్ చేసిన కృషి దేశ ప్రగతికి ఎంతో దోహదపడిందన్నారు.

విద్య అనేది కేవలం ఉద్యోగం పొందేందుకు మాత్రమే కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక సమానత్వానికి, దేశాభివృద్ధికి ప్రధాన సాధనమని ఆజాద్ భావించారని తెలిపారు. మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యతనిస్తూ, సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు