అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం

11-11-2026 | 07:34pm

-జాతీయ విద్యా దినోత్సవాన్ని విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

-మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్ పాషా

కొత్తగూడెం, నవంబర్ 11 (విజయక్రాంతి): భారతదేశానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్(Maulana Abul Kalam Azad) చేసిన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా కొనియాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ముస్లిం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన ఆజాద్, దేశంలో విద్యావ్యాప్తికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి, విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన హయాంలోనే ఐఐటీలు, ఐఐఎంలు, యూజీసీ వంటి విద్యాసంస్థలకు పునాదులు పడ్డాయని గుర్తుచేశారు.

ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించాల్సి ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆజాద్ జయంతిని మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా ప్రకటించారని గుర్తుచేశారు.అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ మైనార్టీల సంక్షేమాన్ని విస్మరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ఉధ్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లా బేగ్, కార్యదర్శి ముంతాజ్ అలీ, ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు