అనుమతిలేని నిర్మాణాల పై కొరడా
రూ. 5,79,150 జరిమానా
బెల్లంపల్లి, (విజయక్రాంతి): ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు(Municipal officials) అనుమతిలేని నిర్మాణాలపై కురుడ ఝులిపిస్తున్నారు. ఇటీవల అక్రమ నిర్మాణాలు(Illegal constructions), అనుమతి లేకుండా బహులంతస్తుల నిర్మాణాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అనధికారికంగా చేపట్టిన రెండో అంతస్తు నిర్మాణంపై రూ.5,79,150 జరిమానా విధించారు. ఈ కట్టడం పట్టణంలో పోస్టాఫీస్ బస్తీ లో వెలసింది. అధికారుల దృష్టికి వెళ్లడంతో భారీ జరిమానా విధించారు.
తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్–2019లోని సెక్షన్ 180(1) ప్రకారం, అనుమతికి మించి నిర్మాణం చేపట్టినట్లు గుర్తించిన సందర్భంలో సంబంధిత నిర్మాణ యజమానికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరుగుతుందనీ మున్సిపల్ కమిషనర్ అన్ని రమేష్ తెలిపారు. ఈ మేరకు బెల్లంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం జారీ చేసిన నోటీసు ప్రకారం, బెల్లంపల్లి పట్టణంలోని 8-1-169, పోస్టాఫీసు బస్తీకి చెందిన థొంగల భాగ్యలక్ష్మి తన ప్రాంగణంలో అనుమతించిన నిర్మాణ విస్తీర్ణానికి అదనంగా 97.82 చదరపు మీటర్ల (1,053 చదరపు అడుగుల) రెండో అంతస్తు నిర్మాణాన్ని చేపట్టినట్లు అధికారులు గుర్తించారు.
అనధికార నిర్మాణానికి సంబంధించి నిర్మాణ విలువను రూ.23,16,600గా లెక్కించి, దానిపై 25 శాతం పెనాల్టీగా రూ.5,79,150 జరిమానా విధించడం జరిగిందనీ కమిషనర్ రమేష్ పేర్కొన్నారు.. అనధికార నిర్మాణాన్ని తొలగించడం/కూల్చివేయడం అందుకు అయ్యే ఖర్చులను సంబంధిత వ్యక్తి నుంచి చట్ట ప్రకారం రికవరీ చేస్తామని ఈ విషయాన్ని బెల్లంపల్లి పట్టణ ప్రజలు గమనించగలనీ ఆయన హెచ్చరించారు.
అంతేకాకుండా, పట్టణ ప్రజలు జీవో 76 ప్రకారంగా పట్టాలు పొందిన కూడా మీరు బెల్లంపల్లి మున్సిపాలిటీ నుంచి ముందస్తు అనుమతి పొంది మాత్రమే ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు.
బెల్లంపల్లి పట్టణ ప్రజలందరూ అనధికార నిర్మాణాలను చేపట్టకుండా, మున్సిపాలిటీ నిబంధనలను పాటిస్తూ పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.
నోటీసుల గుట్టు?
ఇదిలా ఉండగా అధికారులు అక్రమ నిర్మాణాలుపై ఇలా ఆఘమేఘాల మీద స్పందించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిర్మాణాలు చేపట్టిన క్రమంలో అధికారులు స్పందించకుండా, తీరా భవనాలు పూర్తయ్యేవరకు అధికారులు మౌనంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనుమతి లేని నిర్మాణాలు, అక్రమ కట్టడాలు పట్టణంలో విస్తృ తంగా పెరిగిపోయాయి. అక్రమ నిర్మాణాలు అయా వార్డుల ప్రాతినిధ్య ప్రతినిధుల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా ఉండగా ఇందులో పట్టణ స్థాయి ప్రజా ప్రతి నిధులు, అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు ఫిల్లర్ కు రూ. 10 వేలు చొప్పున వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం లేకుండా ఒక్క నిర్మాణం జరిగడంలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే డీల్ కుదరకపోవడం, అక్రమ కట్టడాలు,అనుమతి లేని నిర్మాణాలు సహించమని నమ్మబలకడం కోసం అధికారులు, ప్రజాప్రతిధులు కలసి జరిమానాలు, నోటిసులివ్వడమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.