పంటకు నిప్పుపెట్టుకున్న రైతుతో మాట్లాడిన కేటీఆర్
దండేపల్లి, (విజయక్రాంతి): సాగునీరు అందక పంట ఎండిపోవడంతో ఆవేదనకు గురై పొలానికి నిప్పంటించుకున్న రైతుతో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఫోన్లో మాట్లాడారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన రైతు సిరిపురం తిరుపతికి ధైర్యం చెప్పారు. పంటలకు నిప్పు పెట్టుకోవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు.
గురువారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ రైతులు, పార్టీ నాయకులతో కలిసి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR Phone Call) మొబైల్ ఫోన్ ద్వారా రైతు సిరిపురం తిరుపతితో పాటు ఇతర రైతులతో మాట్లాడారు. సాగునీరు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం (Government) సరఫరా చేయడం లేదని, నీళ్లు ఇస్తే యూరియా ఇవ్వాల్సి వస్తుందని, పంటలు పండితే కొనుగోలు చేయడంతో పాటు బోనస్, మద్దతు ధర కల్పించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే నీళ్లు ఇవ్వడం లేదని కేటీఆర్ విమర్శించారు.
మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, స్థానిక ఎమ్మెల్యే రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరో ఏడాది ఓపిక పట్టాలని, ధైర్యం కోల్పోవద్దని రైతులకు సూచించారు. రెండు ఎకరాల పంటకు ఇప్పటికే రూ.70 వేల నష్టం జరిగిందని, ఆవేదనతో పంటకు నిప్పంటించుకున్నానని రైతు చెప్పడంతో కేటీఆర్ ఓదార్చారు.
ఇప్పటికే మూడు సార్లు రైతుబంధు (Rythu Bandhu) నిధులు కూడా నిలిచిపోయాయని కేటీఆర్ విమర్శించారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఎవరూ అధైర్యపడవద్దని, రాబోయేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. రైతులంతా ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.