రహదారుల నాణ్యతలో రాజీ వద్దు

20-11-2026 | 05:20am

తెలంగాణకు పూర్తి సహకారం: కేంద్ర మంత్రి గడ్కరీ

రోడ్లే దేశాభివృద్ధికి చోదకశక్తి : సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): రహదారుల భద్రతకు కేంద్రం ప్రాధాన్యమిస్తోందని, నాణ్యతలో రాజీపడొద్దని ఇంజినీర్లకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇంజినీర్లే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. దేశంలో ఏటా లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తుందని, అందులో ఎక్కువగా యువకులే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకపై జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లు కనిపించవద్దని,ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) సమావేశాన్ని సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. దేశంలో రహదారుల నిర్మాణంలో అనేక రికార్డు లు సాధించామని, ఇందులో ఇంజినీర్లు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

రోడ్ కనెక్టివిటీలో భారత్ ప్రపంచంలోనే నంబర్‌వన్ స్థాయికి ఎదిగిందన్నారు. ప్రపంచంలో విజయవంతమైన రహదారుల నిర్మాణ నమూనాలను అధ్యయనం చేసి దేశంలో అమలు చేస్తున్నట్లు గడ్కరీ వివరించారు. ‘అమెరికా ధనిక దేశం కాబట్టి రోడ్లు బాగుండటం కాదని, ఆ దేశంలో రోడ్లు బాగున్నందునే అమెరికా ధనిక దేశంగా మారింది’ అనే జాన్ ఎఫ్ కెన్నెడీ కొటేషన్‌ను మంత్రి ప్రస్తావించారు.  సంపద రోడ్లను సృష్ఠించదని, రోడ్లే సంపదను సృష్ఠిస్తాయన్నారు. రోడ్లు నాణ్యతతో ఉంటే దేశానికి భారీగా పెట్టుబడులు వస్తాయని గడ్కరీ అభిప్రాయపడ్డారు.

హైవేల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, ఇంజినీర్లు తమ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని కోరారు. అవసరమైన చోట ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించకపోవడం, జంక్షన్ల అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇలాంటిలోపాలకు మనమే బాధ్యత వహించాలని, ఐఆర్‌సీలోని ఇంజినీర్ల సహకారం అవసరమని వారికి సూచించారు. తాను కొంత కఠినంగా మాట్లాడి ఉంటే క్షమించాలని, రహదారి భద్రతలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో రహదారుల అభివృద్ధికి కేంద్రం సహకారం ఉంటుందని గడ్కరీ హామీ ఇచ్చారు.  

ప్రగతిచక్రాలు రహదారులే : సీఎం 

దేశ ప్రగతి చక్రాలు రోడ్లేనని, నాణ్యమైన రహదారులతో దేశం పురోగతి చెందుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రత, మౌలిక సదుపాయాలు, ప్రజా సం క్షేమం విషయంలో రాజకీయాలకు తావులేదన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత దేశాభివృద్ధి పైనే దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకారం అందజేయాలని, దేశ ప్రగతికి రాష్ట్రం కూడా తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యానికి అనుగుణం గా, తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం వెల్లడించారు.

‘తెలంగాణ రైజింగ్ విజన్’తో ముందుకెళ్తన్నామని 2034 నాటికే ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి రాష్ట్రం చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ, జాతీయ జీడీపీలో 5 శాతం వాటా అందిస్తుందని, 2047 నాటికి 10 శాతానికి పెంచుతామని పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణను మూడు ఆర్థిక జోన్లుగా (క్యూర్, ప్యూర్, రేర్) విభజించినట్లు సీఎం వివరించారు. కీలక మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, భవనాల శాఖ అనే క  పనులు చేపడుతుందన్నారు. రోడ్లతో పాటు వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం, నిమ్స్ విస్తరణ, టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రుల ద్వారా 8 వేల పడకలను అందుబాటులోకి తెస్తున్నామని సీఎం వెల్లడించారు.

రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత ప్యూచర్ సిటీలో అతిపెద్ద ఎక్స్‌పో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’  నిర్వహించనున్నట్లు చెప్పా రు. దేశాభివృద్ధిలో, పెట్టుబడుల సాధనలో ఈ సదస్సు అత్యంత కీలకం కానుందన్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అందించిన ప్రతిపాదలనకు పూర్తిగా సహకారం అందించాలని గడ్కరీని సీఎం రేవంత్ కోరారు.    

రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి ఆమోదం తెలపాలి: మంత్రి కోమటిరెడ్డి  

రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికతో ముందుకెళ్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 441 రోడ్లను 6,092 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) కింద రూ.13,060 కోట్లతో కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. 15 ఏళ్లపాటు వాటి నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్ భాగంగా రాష్ట్రంలో ప్రత్యేక రోడ్డు సెక్టార్ పాలసీ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి త్వరగా ఆమోదం తెలపాలని, హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ ఆరు లేన్లుగా విస్తరించేందుకు అనుమతులివ్వాలని, హైదరాబాద్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి  సహకరించాలని, రాష్ట్రంలో 2,144 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 23 రోడ్లను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఎల్బీనగర్ మధ్య డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 511.68 కిలోమీటర్ల మేర సీఆర్‌ఐఎఫ్ రోడ్డు పనులు, పర్వతమాల పథకం కింద రూ.1,230 కోట్లతో ఐదు రోప్‌వేలు, సేతు బంధన్ పథకం కింద మూడు ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరారు.

హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకు కూడా అనుమతులివ్వాలని, ‘రైట్ టు వాక్’కు ప్రాధాన్యమివ్వాలని విన్నవించారు. నల్లగొండ జిల్లాలో 67 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి రవాణా, రోడ్ల నిర్మాణ శిక్షణ సంస్థ ఏర్పాటు, నేషనల్ హైవేల వెంట ట్రక్ టెర్మినల్స్ ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి వివరించారు. హైవేల నిర్మాణంలో గడ్కరీ కృషిని మంత్రి వెంకట్‌రెడ్డి ప్రశంసించారు. ‘హైవే మ్యాన్ ఆఫ్‌ఇండియా’గా గడ్కరీని అభివర్ణించారు. 

ఎంపీలెలా కనిపిస్తున్నరు? : రఘునందన్

సమావేశం నిర్వహణ తీరుపై ఎంపీ రఘు నందన్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటో కాల్ పాటించలేదని మండిపడ్డారు.‘ఎక్కడ ప్రోగ్రామ్ చీఫ్ సెక్రటరీ’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేం ఎక్కడ కూర్చోవాలి, మాలాంజ్ ఎక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రోగ్రామ్‌గా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎంపీలు వస్తే ఆహ్వానించే వారు లేరు. కాం ట్రాక్టర్ల కోసమే పోగ్రామ్ పెట్టుకున్నారా. మమ్మల్ని పిలిచి ఎందుకు అవమానించాలి.’ అని ఫైర్ అయ్యారు.

మరిన్ని వార్తలు