రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): రోడ్డు ప్రమాద బాధితులకు(victims of road accidents) తక్షణ వైద్యం అందించి ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా ప్రధానమంత్రి రహత్ పథకాన్ని(Prime Minister Rahat plan) జిల్లాలో సమర్థంగా అమలు చేయాలని ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ సూచించారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో(District Medical and Health Office) సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పథకం ద్వారా ప్రమాద బాధితులను సమీప ఆసుపత్రికి తరలించి, ప్రమాదం జరిగిన తొలి గంటలో అత్యవసర చికిత్స అందించడంతోపాటు ఏడు రోజులపాటు నగదు రహిత వైద్య సేవలు(Cashless medical services) కల్పించనున్నట్లు తెలిపారు. ఒక్కో బాధితుడికి రూ.1.50 లక్షల వరకు ఉచిత చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలోని నాలుగు ప్రభుత్వ, ఐదు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు, ఆసుపత్రి నిర్వాహకులకు పథకంపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. పోలీసు, వైద్య ఆరోగ్య, రవాణా శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించేలా 112 హెల్ప్లైన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్తలు సత్యనారాయణ, రాకేష్, పీఎం రహత్ కౌన్సిలర్ శ్రీనివాస్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వెంకట సాయి పాల్గొన్నారు.