సిఎంఆర్ డెలివరీ సకాలంలో పూర్తి చేయాలి

15-10-2026 | 05:50pm

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

మంచిర్యాల, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులు సిఎంఆర్ డెలివరీ సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు(District Additional Collector (Revenue) V. Ramulu) అన్నారు. గురువారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఛాంబర్ లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వేణుగోపాల్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ లతో కలిసి సిఎంఆర్ డెలివరీ పై అధికారులు, రైస్ మిల్లుల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సిఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యం డెలివరీలలో వెనుకబడిన మిల్లులు తమ పని తీరును మెరుగుపరుచుకొని, బియ్యం అప్పగింతలను వేగవంతం చేయాలని తెలిపారు. కొన్ని మిల్లులు నిర్దేశిత లక్ష్యాల సాధనలో జాప్యం చేస్తున్నాయని, పెండింగ్ లో ఉన్న సిఎంఆర్ బియ్యం డెలివరీలను తక్షణమే వేగవంతం చేసి,

ప్రభుత్వం నిర్దేశించిన కార్యాచరణ ప్రకారం గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. సిఎంఆర్ బియ్యం లక్ష్యాల సాధనలో ఆలస్యం జరగకుండా మిల్లర్లు తగిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఈ సమావేశంలో రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు