బీసీసీఐకి షాక్.. నో చెప్పిన మాజీ దిగ్గజాలు?

15-10-2026 | 06:56pm

బీసీసీఐకి కొత్త తలనొప్పి.. సెలెక్టర్ పదవికి నో చెబుతున్న దిగ్గజాలు!

న్యూఢిల్లీ: టీమిండియా పురుషుల సెలెక్షన్ కమిటీలో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సవాలుగా మారింది. అనుభవజ్ఞులైన మాజీ క్రికెటర్లను సెలెక్టర్లుగా నియమించాలన్న బోర్డు ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. దాదాపు 100 టెస్టులు ఆడిన ఇద్దరు మాజీ భారత క్రికెటర్లు ఈ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపలేదని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, వారి పేర్లను అధికారికంగా వెల్లడించలేదు.

అగార్కర్ స్థానంలోకి వచ్చేదెవరు?

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4తో ముగిసింది. కాంట్రాక్ట్ పొడిగింపును కోరుకోకపోవడంతో ఆయన స్థానంలో కొత్త సభ్యుడి ఎంపికపై బీసీసీఐ దృష్టి సారించింది. వెస్ట్ జోన్ కోటాలో ఒక సెలెక్టర్ పోస్టు భర్తీకి అక్టోబర్ 6న దరఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్ 14తో దరఖాస్తుల గడువు ముగిసింది. 

భారీ ప్యాకేజీతోనూ ఆసక్తి కరవు!

సెలెక్షన్ కమిటీలోకి పేరున్న మాజీ క్రికెటర్ల(Former Cricketers)ను తీసుకురావాలన్న ఉద్దేశంతో బీసీసీఐ(BCCI ) ఆర్థిక ప్రోత్సాహకాలను పెంచేందుకు సిద్ధమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సెలెక్షన్ కమిటీల బడ్జెట్‌ను కూడా పెంచినట్లు సమాచారం. అయినప్పటికీ, ఈ బాధ్యతలు చేపట్టేందుకు మాజీ ఆటగాళ్లు వెనుకడుగు వేస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.పార్థివ్ పటేల్ కూడా దరఖాస్తు చేయలేదు

ఈ పదవికి పోటీ పడవచ్చని భావించిన మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్(Former Wicketkeeper Parthiv Patel) సైతం దరఖాస్తు చేసుకోలేదు. దీంతో తదుపరి సెలెక్టర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రజ్ఞాన్ ఓఝా తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, ఆర్‌పీ సింగ్, అజయ్ రాత్రా, శివసుందర్ దాస్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

సెలెక్టర్ పదవికి అర్హతలేంటి?

బీసీసీఐ నిబంధనల(BCCI Rules) ప్రకారం ఈ పదవికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం ఏడు టెస్టులు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. ప్రత్యామ్నాయంగా, 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా అర్హతగా పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కనీసం ఐదేళ్లు పూర్తయి ఉండాలి.

అనుభవజ్ఞులైన మాజీ క్రికెటర్ల కోసం బీసీసీఐ అన్వేషణ కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త సెలెక్టర్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఖాళీని ఎవరితో భర్తీ చేస్తారు? ప్రస్తుత కమిటీలోనే మార్పులు చేస్తారా? అన్నది అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టత రానుంది.

మరిన్ని వార్తలు