పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించిన గ్రామీణ పేదల సంఘం, ఓపిడిఆర్ నాయకులు
మోతె, అక్టోబర్15 (విజయ క్రాంతి): గురువారం మండల పరిధిలోని నామవరం, రాఘవపురం, రాఘవపురం స్టేజీ, తదితర గ్రామాల్లో ఎండిపోతున్న పంట పొలాలను గ్రామీణ పేదల సంఘం(Association of the Rural Poor) జిల్లా నాయకులు కామ్రేడ్ పాలకూరి ఎల్లయ్య, ఓపిడిఆర్ నాయకులు కామ్రేడ్ తండు మల్సూరు నాయకత్వంలో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మోతె మండలంలో సుమారు 70 శాతం పంట పొలాలు నీటి సౌకర్యం లేక, విద్యుత్ కోతల కారణంగా ఎండిపోతున్నాయని తెలిపారు. జూలై నెలలో కురిసిన అరకొర వర్షాలను నమ్ముకుని రైతులు పత్తి, పెసర, కంది తదితర పంటలను సాగు చేశారని, మరికొందరు రైతులు బోరుబావుల కింద వరి నాట్లు వేశారని పేర్కొన్నారు. అయితే, విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, కనీసం ఎనిమిది గంటల పాటు కూడా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కావడం లేదని విమర్శించారు. విద్యుత్ కోతల వల్ల సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
జూలై నెలలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండినప్పటికీ, దిగువ ప్రాంతాలకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య, నామవరం ఉపసర్పంచ్ మండల శీను, కొమ్మ వెంకన్న, కొమ్ము మల్లయ్య, తండు కృష్ణయ్య, తండు నాగయ్య, అనంతుల ఎల్లయ్య, బాష్పంగు సునీల్, బైరి నాగేష్, తండు నరసింహ తదితరులు పాల్గొన్నారు.