అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

15-10-2026 | 06:54pm

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

బెల్లంపల్లి: మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలను పాటించి పూర్తి చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అనధికార నిర్మాణాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య(Additional Collector P. Chandrayya) అన్నారు.గురువారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని 17, 18 వార్డులను ఆకస్మికంగా ఆయన సందర్శించారు.

ఆయా వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులు, నిర్మాణ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలోని 18వ వార్డులో సుమారు రూ. 20 లక్షల వ్యయంతో సి.సి. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందనిన్నారు. నిర్మాణంలో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో పనులను చేపట్టామని తెలిపారు.

నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, నిర్మాణ పనుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. 17వ వార్డులో అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాన్ని పరిశీలించి, మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపట్టడం విరుద్ధమని చెప్పారు.

సదరు నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలను పరిశీలించి, తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అవసరమైన చట్టపరమైన ప్రక్రియను అనుసరించి అనధికార నిర్మాణాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనధికార నిర్మాణానికి ఇంటి నంబరు కేటాయించి, సంబంధిత వివరాలను ఆన్‌లైన్ వ్యవస్థలో నమోదు చేయడంలో సంబంధిత దరఖాస్తులు,

అనుమతులు, ఇతర మున్సిపల్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపు జరిగినట్లు నిర్ధారణ అయితే అట్టి ఇంటి నంబరు వివరాలను నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ వ్యవస్థ నుంచి తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో అనధికార నిర్మాణాలకు ఇంటి నంబర్లు కేటాయించడం,

వాటికి సంబంధించిన వివరాలను మున్సిపల్ రికార్డులలో నమోదు చేయడం వంటి అంశాలలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రణాళిక అమలుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని,

అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల ఉల్లంఘనలను గుర్తించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని తెలిపారు. పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు క్రమబద్ధమైన పట్టణాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలకు నాణ్యమైన రహదారులు, మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని హితవు పలికారు.

ప్రత్యేక శిబిరాలను సందర్శన..

మండల కేంద్రంలోని 86, 87, 88, 89 పోలింగ్ కేంద్రాలలో కొనసాగుతున్న ప్రత్యేక శిబిరాలను ఆయన సందర్శించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా దావా, అభ్యంతరాల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. బెల్లంపల్లి ఈఆర్‌ఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు.

ఓటరు జాబితా సమగ్ర సవరణలో అర్హత కలిగిన ప్రతి ఓటరు వివరాలు జాబితాలో ఉండాలనిన్నారు. అనర్హుల వివరాలు ఉండకూడదని, ఆ దిశగా స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, వైస్ చైర్మన్ సత్యనారాయణ, అసిస్టెంట్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు