ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను జిల్లా వైద్య(District Medical and Health Officer Dr. Narendra Rathod) ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేంద్ర రాథోడ్ గురువారం పరిశీలించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. 30 ఏళ్లు పైబడిన వారందరికీ బీపీ, మధుమేహ పరీక్షలు చేసి, వ్యాధిగ్రస్తులకు నిరంతరం మందులు అందించాలని సూచించారు.
రోగుల వివరాలను ఆధార్తో అనుసంధానించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.వ్యాధుల నివారణకు ప్రజాప్రతినిధుల సహకారంతో వైద్య శిబిరాలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గర్భిణుల నమోదు, టీకాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత పాటించాలని, వారంలో రెండు రోజులు డ్రైడే నిర్వహించాలని సూచించారు.
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఆహారం తీసుకునే ముందు, మరుగుదొడ్డి వినియోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో పలు వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, నర్సింగ్ అధికారి కవిత, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.