76 కేసుల్లో 112 మందికి శిక్షలు

20-11-2026 | 04:33pm

8 మందికి జీవిత ఖైదు.. రూ. 7.44 లక్షల జరిమానా

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): నేరాల దర్యాప్తులో నాణ్యత, న్యాయస్థానాల్లో పటిష్టమైన ఆధారాల సమర్పణతో నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేసిన పోలీసు, ప్రాసిక్యూషన్ అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. 2026 సంవత్సరంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 76 కాంటెస్టెడ్ కన్విక్షన్ కేసుల్లో 112 మంది నిందితులకు న్యాయస్థానాలు శిక్షలు విధించినట్లు తెలిపారు.

వీటిలో 8 కేసుల్లో 8 మందికి జీవిత ఖైదుతో పాటు రూ.55 వేల జరిమానా, 2 కేసుల్లో ఐదుగురికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.21 వేల జరిమానా విధించాయి. మరో కేసులో ఒకరికి 12 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా, 9 కేసుల్లో 10 మందికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.90 వేల జరిమానా విధించాయి. ఒక కేసులో ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా, 5 కేసుల్లో ఏడుగురికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.84 వేల జరిమానా పడింది. మరో 39 కేసుల్లో 49 మందికి నాలుగేళ్లలోపు జైలు శిక్షలు విధించగా, 11 కేసుల్లో 31 మందికి రూ.1,30,300 జరిమానా విధించాయి. మొత్తంగా రూ.7,44,500 జరిమానా విధించినట్లు సీపీ వెల్లడించారు.

నేరం చేసిన వ్యక్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేయడం పోలీసుల ప్రధాన బాధ్యతని అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు పూర్తి చేయడం, శాస్త్రీయ ఆధారాల సేకరణ, సాక్ష్యాల బలోపేతం, న్యాయస్థానాల్లో వాటిని సమర్థవంతంగా ప్రవేశపెట్టడం వరకు ప్రతి దశలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. నిందితులకు శిక్షలు పడినప్పుడే బాధితులకు న్యాయం జరగడంతో పాటు ప్రజల్లో పోలీసు, న్యాయవ్యవస్థలపై నమ్మకం పెరుగుతుందని తెలిపారు.

మహిళలు, చిన్నారులపై నేరాలు, హత్యలు, పోక్సో సహా తీవ్రమైన నేరాల కేసుల్లో ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు చేపట్టి నేరం నిరూపితమయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. కీలక కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ, ఇదే అంకితభావంతో పనిచేసి బాధితులకు న్యాయం చేయాలని సీపీ సూచించారు.

మరిన్ని వార్తలు