వైభవంగా శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి కల్యాణ మహోత్సవం!

15-10-2026 | 09:54pm

భక్తిశ్రద్ధలతో శివపార్వతుల కల్యాణం, అన్నప్రసాద వితరణ!!

శివంపేట అక్టోబర్ 15 ( విజయక్రాంతి ): శివంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు(Sharannavaratri Celebrations) భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ్రీ నవదుర్గాదేవి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారి సన్నిధిలో గ్రామ పురోహితులు చండి పంతులు ఆధ్వర్యంలో, భవానీ ఉత్సవ కమిటీ సహకారంతో శ్రీశ్రీ శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించారు.

అమ్మవారి కృపాకటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని భక్తులు ప్రార్థించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు, భవానీ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు