నాపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు
- భూ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు.. రాజకీయ కక్షతోనే ఆరోపణలు
- కాంగ్రెస్ సీనియర్ నేత పత్తి కృష్ణారెడ్డి
హుజురాబాద్, అక్టోబర్ 14: (విజయ క్రాంతి): రాజకీయ దురుద్దేశంతోనే కొందరు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు(Senior Congress leader), వెంకట్రావుపల్లి సర్పంచ్ అనిత భర్త పత్తి కృష్ణారెడ్డి ఆరోపించారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikara Party) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రజినీకుమార్ యాదవ్ తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. 2019లో తన సోదరుడు పత్తి విష్ణువర్ధన్ రెడ్డి నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరం నాలుగు గుంటల భూమిని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. మృతి చెందిన ఓదెలుతో గానీ, ఆయన కుమారుడితో గానీ తనకు ఎలాంటి ప్రత్యక్ష ఆర్థిక లావాదేవీలు లేవన్నారు.
తన సోదరుడికి సంబంధించిన బకాయిలను చెల్లించేందుకు కుటుంబ బాధ్యతగా సిద్ధంగా ఉన్నానని, గతంలో రూ.2.70 లక్షల చెక్కు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా వారు స్వీకరించలేదని తెలిపారు. బకాయిలు తీసుకోవడం కంటే భూమిని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతోనే కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ఆధారాలు లేని ఆరోపణలతో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోనని, తప్పుడు ప్రచారం నిలిపివేయకపోతే పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటానని పత్తి కృష్ణారెడ్డి హెచ్చరించారు.