ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
మరో యువతికి తీవ్ర గాయాలు
ఘట్ కేసర్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీకొని ఓ బీటెక్ విద్యార్థి మృతి(BTech student dies) చెందగా మరో యువతీకి తీవ్ర గాయాలైన సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్(IT Corridor Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District), తిప్పారెడ్డిపల్లికి చెందిన బద్దుల కిషోర్(Baddula Kishore) (19) అనే విద్యార్థి ప్రస్తుతం బీ.ఎన్.రెడ్డి నగర్ లో నివాసముంటూ ఇబ్రహీంపట్నంలోని సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు.
శనివారం ఉదయం తన బంధువైన విజయ అనే యువతిని యంనంపేట లోని శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష రాయించేందుకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా ఫ్లైఓవర్ పై ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈప్రమాదంలో కిషోర్ కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
గాయపడిన విజయను చికిత్స నిమిత్తం మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించి ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.