ఊరెళ్తున్నారా జాగ్రత్త.!
దసరా సెలవుల్లో ఇళ్ల భద్రత మీ చేతుల్లోనే
ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ పి. కిరణ్
ఘట్ కేసర్, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : దసరా పండుగ(Dasara Festival) సెలవుల్లో ఊర్లకు వెళ్లే ప్రజలు ఇంటి భద్రత కోసం పలు జాగ్రత్తలు పాటించాలని ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ పి. కిరణ్(Ghatkesar Inspector P. Kiran) పలు ముఖ్యమైన సూచనలు చేశారు. ఇంట్లో బంగారం, వెండి, నగదు(Gold, silver, cash) పెట్టొద్దని, బ్యాంక్ లాకర్ లో ఉంచాలన్నారు. ఇంటి ఆవరణలో సీసీటీవీ కెమెరా(CCTV camera), అలారం, తలుపులకు సెంట్రల్ లాక్ ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదని పేర్కొన్నారు. ఇంటి తలుపులకు వేసిన తాళం కనబడకుండా కర్టెన్ వేయాలని, బయట గొల్లం పెట్టవద్దన్నారు.
ఒక గదిలో లైట్ ఆన్ చేసి ఉంచాలని, తలుపు ముందు చెప్పులు పెట్టాలని, పేపర్, పాలు వేసే వారికి సెలవు సమయంలో రావొద్దని తెలపాలని సూచించారు. ప్రయాణ వివరాలు సోషల్ మీడియాలో పంచుకోకండని, ఇంటి పక్కవారు, నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలన్నారు.
కొత్త వ్యక్తులు, డెలివరీ బాయ్స్(Delivery Boys) పట్ల అప్రమత్తంగా ఉండాలని, బస్సు, రైల్లో అపరిచితులు ఇచ్చే తినుబండారాలు తీసుకోవద్దని, మీకు ఎవరిమీదైనా అనుమానం వస్తే వెంటనే 100/112 టోల్ ఫ్రీ నెంబర్ కు గాని, రాచకొండ పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 62666కు లేదా మా వాట్సాప్ నెంబర్ 87126 62111కు డయల్ చేయాలని సీఐ కిరణ్ ప్రజలకు సూచనలు చేశారు.