27 నుంచి పాదయాత్ర

22-10-2026 | 05:30am
  1. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై పోరుబాట 
  2. 23న బాధితులతో, 25న మేధావులతో భేటీ
  3. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటన

జవహర్‌నగర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్(Jawaharnagar Dumping Yard) ఎత్తివేయాలని డిమాండ్‌చేస్తూ ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేయనున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మీడియాతో ఈ విషయం వెల్లడించారు. గరీబోళ్లు జీవించే అడ్డా జవహర్‌నగర్ అని, నేడు ఆ ప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకున్నదని అన్నారు.

ఇక్కడి డంపింగ్ యార్డ్ వల్ల పరిసర ప్రాంతాలైన కీసర, దమ్మాయిగూడ, నాగారం, అహ్మద్‌గూడ, ఘట్‌కేసర్ తదితర ప్రాంతాల్లో జీవ వైవిధ్య సమస్యలు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశుపక్ష్యాదులు, ఇతర జీవుల ఉనికికి ప్రమాదకరంగా మారిందని ఆవేదన చెందారు. భూగర్భ జలాలు కలుషితమైపోయాయని, జవహర్‌నగర్ చుట్టుపక్కల ప్రజల జీవితం అగమ్యగోచరంగా తయారైందని పేర్కొన్నారు.

గతంలో ఎంపీగా పనిచేసిన రేవంత్‌రెడ్డి ఈ సమస్య గురించి అప్పట్లో తీవ్రంగా ప్రతిఘటించాడని, కానీ నేడు ముఖ్యమంత్రిగా ఆయన ఈ సమస్యను మరిచిపోవడం బాధాకరమని అన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల పరిసర ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఈ నెల 23న బాధితులతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

అలాగే 25వ తేదీన మేధావులతో సమావేశం నిర్వహించనునన్నట్లు తెలిపారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి, బీజేపీ నాయకుడు కలికోట కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు