రెండు చుక్కలు వేయించండి..
22-11-2026 | 09:14pm
మేడ్చల్ అర్బన్, నవంబర్ 22 (విజయక్రాంతి): గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని 299వ డివిజన్లో ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల మందు వేయించినట్లు మేడ్చల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు రెండు పల్స్ పోలియో చుక్కలు వేయించి పోలియో(Polio) మహమ్మారిని తరిమికొట్టాలని చిన్నారుల తల్లిదండ్రులకు సూచించారు.
అనంతరం మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 297, 298వ డివిజన్లలో కూడా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించినట్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, మాజీ కౌన్సిలర్ నడికొప్పు ఉమా నాగరాజు ముదిరాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు బాధ్యతగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కోరారు. చిన్నారులను పోలియో వ్యాధి నుంచి రక్షించేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన(Awareness) కలిగి ఉండాలని సూచించారు.
పిల్లల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తు అని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని అమరం మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ(Health Protection)లో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం వెంకటేష్ ముదిరాజ్, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.