ఓటీటీలోకి ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్(Venkatesh Trivikram) కాంబినేషన్లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నెం.47’(Adarsha Kutumbam House No 47) ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. కుటుంబ కథకు యాక్షన్, కామెడీ అంశాలను జోడిస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేశ్ చిట్టిబాబు పాత్రలో కనిపించారు.
మధ్యతరగతి బ్యాంకు ఉద్యోగి అయిన చిట్టిబాబు కుటుంబం అప్పులు, పిల్లల సమస్యలతో సతమతమవుతుంటుంది. ఇలాంటి సమయంలో అతడికి రూ.100 కోట్ల లాటరీ తగలడంతో వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. అద్దె ఇంటి నుంచి విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలోని హౌస్ నంబర్ 47కు చేరుకుంటారు.
అయితే, ఆ ఆనందం ఎంతోకాలం నిలవదు. బిహార్‌కు చెందిన టార్జన్ దోపిడీ ముఠా ఆ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో కథలో ఉత్కంఠ మొదలవుతుంది. ఆ ముఠా ఎవరు? చిట్టిబాబు కుటుంబం వెంట ఎందుకు పడింది? అనే అంశాలు సినిమాలో ఆసక్తికరంగా సాగుతాయి.
శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నారా రోహిత్, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మించగా, త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఈ నెల 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాను వీక్షించవచ్చు.