విజయ్, రష్మికను చూడాలంటే.. ట్యాంక్‌బండ్‌కు వెళ్లండి!
హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రాష్ట్ర ప్రభుత్వం ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు సినీ తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హాజరుకానుండటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
అప్పర్ ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దాదాపు 700 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. తెలంగాణ జానపద కళలు, సంప్రదాయ నృత్యాలతో పాటు ప్రత్యేక లేజర్ షోను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర సంస్కృతి, కళా వైభవాన్ని చాటిచెప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వేడుకలను వీక్షించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో సందర్శకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు భద్రతా ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.
ట్యాంక్‌బండ్‌తో పాటు నెక్లెస్ రోడ్‌లోని కర్బలా మైదానం, పబ్లిక్ గార్డెన్‌లోనూ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు. బతుకమ్మ పాటలు, కళాకారుల ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాలతో నగరంలో పండుగ సందడి నెలకొననుంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ అయిన బతుకమ్మ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.