పల్లెల్లోనూ ప్యాకెట్ పాలే!

18-10-2026 | 05:15am
  1. పశు సంపద తగ్గడమే కారణం
  2. వ్యవసాయ యాంత్రీకరణ కూడా..
  3. పశు పోషణ పట్ల రైతుల్లో విముఖత
  4. తప్పని స్థితిలో ప్యాకెట్ పాలే గతి!

రామారెడ్డి, అక్టోబర్ ౧౭ (విజయక్రాంతి): ఒకప్పుడు పల్లెల్లో ఇంటింటికీ బర్రెపాలు(Buffalo milk) అందేవి. పాడిరైతులు ఉదయం, సాయంత్రం చిన్న చెంబులు, స్టీల్ పాత్రలతో తిరుగుతూ పాలు పోసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. పశుసంపద తగ్గిపోవడం, పాడి పరిశ్రమపై గ్రామీణులు ఆసక్తి చూపకపోవడంతో పల్లెల్లోనూ ప్యాకెట్ పాలకు డిమాండ్ పెరిగింది. కిరాణా దుకాణాలు, కూల్‌డ్రింక్ షాపుల వద్ద పాల ప్యాకెట్ల కోసం గ్రామీణులు బారులు తీరుతున్నారు. 

తగ్గుతున్న పశుసంపద

వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరగడంతో ఎద్దుల అవసరం తగ్గింది. సాగు విస్తీర్ణం పెరగడం, పశువుల మేతకు పచ్చిక బయళ్లు తగ్గడం, పశుపోషణ భారంగా మారడంతో రైతులు పశువుల సంఖ్యను తగ్గిస్తున్నారు. గతంలో ఒక్కో గ్రామంలో వందల సంఖ్యలో పశువులు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పశుసంవర్ధక శాఖ లెక్కలు సూచిస్తున్నాయి. దీంతో పల్లెల్లో స్థానికంగా లభించే పాలు తగ్గిపోతున్నాయి.

ప్యాకెట్లపై మోజు

ఒకప్పుడు పాడిరైతులు 5 నుంచి 10 గేదెల వరకు పెంచుతూ పాలను విక్రయించేవారు. ప్రస్తుతం మినీ డెయిరీలు ఏర్పాటు చేసేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపడం లేదు. మరోవైపు వివిధ సంస్థల పాల ప్యాకెట్లు తెల్లవారుజామునే గ్రామాలకు చేరుతుండటంతో ప్రజలకు అవే సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కో గ్రామంలో రోజుకు వందల నుంచి వేల వరకు పాల ప్యాకెట్లు అమ్ముడవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ప్యాకెట్లతో పాటు పెరుగు విక్రయాలు కూడా పెరిగాయి. 

బర్రెపాల నుంచి.. ప్యాకెట్ పాల వరకు: 

పాడిరైతులు తమ పాలను డెయిరీ కేంద్రాలకు పోస్తుండటంతో స్థానికంగా నేరుగా పాలు కొనుగోలు చేసే అవకాశం తగ్గింది. దీంతో అవసరమైనవారు ఉదయం డెయిరీ కేంద్రాల వద్దకు వెళ్లి పాలు కొనుగోలు చేయడం లేదా దుకాణాల్లో ప్యాకెట్లు తీసుకోవడం చేస్తున్నారు. ఒకప్పుడు పల్లె జీవనంలో భాగమైన పశుసంపద క్రమంగా తగ్గిపోతుండటంతో గ్రామీణుల పాల అవసరాలను ఇప్పుడు ప్యాకెట్లు తీరుస్తున్నాయి.పశుసంపదను పెంచేందుకు ప్రోత్సాహకాలు అందించి పాడి పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావాలని గ్రామీణులు కోరుతున్నారు.

పాత రోజుల్లోనే బాగుండే

మా చిన్నప్పుడు ఇంటి వద్దనే బర్రెపాలు పోసేవారు. ఇప్పుడు పాలు కావాలంటే దుకాణానికి వెళ్లి ప్యాకెట్ కొనుక్కోవాల్సి వస్తోంది. పశువులను పెంచేవారు తగ్గిపోవడం, పశుపోషణ ఖర్చులు పెరగడంతో పల్లెల్లోనూ ప్యాకెట్ పాల వినియోగం పెరిగింది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో పశువులు కనిపించేవి. ఇప్పుడు ఆవులు, బర్రెలు ఉన్న ఇళ్లు తగ్గిపోవడంతో పాల ప్యాకెట్లే దిక్కవుతున్నాయి. పల్లెల్లోనూ మారుతున్న ఈ పరిస్థితి చూస్తుంటే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి.

మునురు ఉమారాణి, కామారెడ్డి జిల్లా

పాల ప్యాకెట్లకు గిరాకి బాగుంది

గతంలో పల్లెల్లో ఇంటింటికీ బర్రెపాలు పోసేవారు. ఇప్పుడు మా కిరాణా దుకాణాల్లోనే పాల ప్యాకెట్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఉదయం నుంచే పాలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వస్తున్నారు. గతంతో పోలిస్తే ప్యాకెట్ పాల విక్రయాలు బాగా పెరిగాయి. పశువుల పెంపకం తగ్గిపోవడంతో గ్రామాల్లోనూ ప్రజలు ప్యాకెట్ పాలపైనే ఆధారపడుతున్నారు.

 అశోక్, కిరాణ షాప్ యజమాని, కామారెడ్డి జిల్లా

మరిన్ని వార్తలు