గుర్తింపులేని చదువులు

18-10-2026 | 05:30am
  1. 162 ఇంటర్ కాలేజీలకు దక్కని అఫిలియేషన్
  2. లక్ష మందికిపైగా విద్యార్థుల భవిష్యత్తు పరేషాన్
  3. కాలేజీలు ప్రారంభమై 4 నెలలు దాటినా అనుమతుల్లేవ్
  4. ఆ విషయం తెలియక అడ్మిషన్లు పొందిన విద్యార్థులు
  5. ఈ నెల 26 నుంచి ఎగ్జామ్ ఫీజు చెల్లింపు
  6. ఈలోగా అఫిలియేషన్ రాకపోతే విద్యాసంవత్సరం కోల్పోయినట్లే!
  7. ఫైర్ ఎన్వోసీ, శానిటేషన్ సర్టిఫికెట్లు వంటివి లేకపోవడమే కారణం 

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలోని దాదాపు లక్ష మందికిపైగా ఇంటర్ విద్యార్థుల(Intermediate students) భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. ఇంటర్ కాలేజీలు ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో ఇంకా 162 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అఫిలియేషన్(Affiliation of Private Junior Colleges) పొందలేదు. ఫైర్ ఎన్వోసీ, శానిటేషన్ సర్టిఫికెట్లు వంటివి ఇంటర్ బోర్డుకు సమర్పించకపోవడంతోనే ఈ కాలేజీలకు గుర్తింపు పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తున్నది.

నిబంధనల ప్రకారం ఈ సర్టిఫికెట్లు లేకుండా కాలేజీలకు అనుమతి ఇవ్వకూడదు. ఇంకా, ఆ కాలేజీలకు గుర్తింపు దక్కకపోడంతో వాటిలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ఏమిటో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

అనుమతుల్లేకుండానే తరగతులు

ఆ కాలేజీలకు బోర్డు నుంచి అనుమతులు లేవు. కానీ అడ్మిషన్లు చేపట్టారు. తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు. గుర్తింపు ఉందో లేదో తెలియక చాలా మంది విద్యార్థులు ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు పొందారు. ఇప్పుడు తెలిశాక విద్యార్థుల తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. మరోవైపు ఈ నెల 26 నుంచి ఇంటర్ వార్షిక ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించడంతో తాము చదువుతున్న కాలేజీలకు అనుమతి లేక ఫీజు ఎలా చెల్లించాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరీక్ష ఫీజు చెల్లింపు గడువు దగ్గరపడుతున్నందున ఇంటర్ బోర్డు ఈ 162 కాలేజీల అఫిలియేషన్‌పై స్పందించాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం అంటున్నది. ఒకవేళ ఇంటర్ బోర్డు గుర్తింపు ఇవ్వకుంటే లక్ష మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు రాక వారి ఏడాది చదువు వృథా అయ్యే ప్రమాదం ఉంది. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవడంతోపాటు విద్యార్థులకు న్యాయం చేయాలని పలు విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

ఫీజులు ఫుల్‌గా వసూలు

రాష్ట్రంలో ఈ ఏడాది ఇంటర్ బోర్డు గుర్తింపు కోసం 1,424 కాలేజీలు దరఖాస్తు చేసుకోగా వాటిలో ఈ నెల 16 వరకు 1,262 కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చినట్లు బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపరిచింది. ఇంకా 162 కాలేజీలకు అనుమతి లేదు. వీటిలో కార్పొరేట్ కాలేజీలతోపాటు బడ్జెట్ ప్రైవేటు కాలేజీలున్నాయి. ఈ ఏడాది ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచే ప్రారంభమైంది.

ప్రారంభమై నాలుగు నెలలు దాటినా ఇప్పటికీ కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్‌బోర్డు అనుమతి ఇవ్వలేదు. ఇంటర్ బోర్డు అనుమతి లేకపోయినప్పటికీ ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకొని విద్యార్థులకు తరగతులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మందికిపైగా విద్యార్థులు అనుమతి లేని కాలేజీల్లో చదువుతున్నారు. ఇప్పటికే విద్యార్థుల నుంచి కొన్ని కాలేజీలు మొత్తం ఫీజులను వసూలు చేశాయి.

ఈ నెల 26లోపు రాకపోతే..!

ఆయా కాలేజీలకు గతేడాది ఇంటర్ బోర్డు గుర్తింపునివ్వడంతో ఈ ఏడాది కూడా అడ్మిషన్లను తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది కూడా గుర్తింపు ఇవ్వాలని కళాశాలల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లించడానికి రెండు రోజుల క్రితమే ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు ఫీజు చెల్లించడానికి విద్యార్థులకు అవకాశం కల్పించింది. అపరాధ రుసుంతో డిసెంబర్ 14 వరకు చెల్లించొచ్చు. ఫైర్ ఎన్‌వోసీతోపాటు ఇతర సర్టిఫికెట్లు లేకపోవడంతోనే 162 కాలేజీలకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. వీటిలో దాదాపు లక్ష మందికిపైగా స్టూడెంట్లు చదువుతున్నారు. ఈ కాలేజీలకు ఈ నెల 26లోగా అనుమతులు వస్తేనే వాటిలోని విద్యార్థులు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఆ లోపు అనుమతులు రాకపోతే వార్షిక ఫీజు చెల్లించడానికి కుదరదు. ఫీజు చెల్లించకుంటే హాల్‌టికెట్లు జారీ కావు.. పరీక్షలు రాసే అవకాశం ఉండదు. 

మరిన్ని వార్తలు