వరంగల్, హనుమకొండకు ఐటీ టవర్లు
- హైదరాబాద్ తరహాలో అన్ని రంగాల్లో అభివృద్ధి
- ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు హామీ
- పద్మాక్షి, భద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు
- భద్రకాళి ఆమ్మవారి రథం ప్రారంభం
వరంగల్ (మహబూబాబాద్), అక్టోబర్ 17 (విజయక్రాంతి): హైదరాబాద్ తరహాలో వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(IT Minister Sridhar Babu) హామీ ఇచ్చారు. వరంగల్, హనుమకొండ నగరాలకు ఐటీ టవర్ల ఏర్పాటు కోసం అవసరమైన ప్రతిపాదనలను పరిశీలించి, ముందుకు తీసుకెళ్తామన్నారు. చారిత్రక వరంగల్ నగరంలో పారిశ్రామిక, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రభు త్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఆయన తెలిపారు.
నా యిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలో ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ (ఎడిషన్-2)ను మంత్రి శ్రీధర్‌బాబు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం పలు ఆలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత పద్మాక్షి అమ్మవారిని దర్శించుకుని హోమపూజలో పాల్గొన్నా రు. ఆ తర్వాత భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
భద్రాకాళి రథం ప్రారంభం
భద్రకాళి అమ్మవారి ఆలయ రథ నిర్మాణ పనులు పూర్తికావడంతో.. ఆలయ అధికారులు, అర్చకుల ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని ముందుకు లాగి ప్రారంభించారు. మాడవీధుల్లో ఊరేగింపునకు సిద్ధమైన అమ్మవారి రథం ప్రారంభం కావడం సంతోషంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
ఆ తర్వాత వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి వద్ద కూడా పూజల్లో పాల్గొన్నారు. వరంగల్ నగరం చారిత్రక కట్టడాలు, ప్రాచీన ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయమని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేశారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు వరంగల్, హనుమకొండ నగరాల్లో ఐటీ టవర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి నీలిమ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.