దసరాకు విశిష్టస్థానం
- విజయానికి చిహ్నమే విజయదశమి
- 9 రోజుల పాటు దుర్గామాతకు పూజలు
- మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మ ఆటలు పదో రోజు రావణ దహనం, జమ్మిపూజ
- ఒకరికొకరు ఆలింగనాలు.. అలయ్ బలయ్ కోలాహలం
దేశంలో దసరా పండుగను(Dasara Festival) ఒక్కో ప్రాంతంలో ఒక్కోరీతిన జరుపుకుంటుంటారు. తెలంగాణలో(Telangana) మాత్రం దసరాకు విశిష్టస్థానం ఉంది. రాముడు రావణుడిని వధించడం.. పాండవులు వనవాసం వీడడం, జగన్మాత మహిషాసుర రాక్షసుడిని చంపడం.. ఈ విజయాల చిహ్నమే విజయదశమి. 9 రోజుల పాటు దుర్గామాతను కొలవడం, మహిళలు బతుకమ్మ ఆడే వేడుకలు అంబరాన్నం టుతాయి. పదో రోజు రావణ దహనం, జమ్మిపూజ, పాలపిట్ట దర్శనం ఆనవాయితీగా వస్తోంది. ఆ మరుసటి రోజు మాజీ గవ ర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ నిర్వహించే ‘అలయ్ బలయ్’ కూడా తెలంగాణలో మరో విశిష్టతగా నిలుస్తోంది.
దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నుంచి శుద్ధనవమి వరకు తొమ్మిది రోజులు.. దేవీ నవరాత్రులు, పదో రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా పిలుస్తుంటారు. శరత్రుతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది.
కొందరు ఈ పండుగ మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. అయితే దసరా పండుగను మాత్రం పదోరోజైన విజయదశమి నాడు జరుపుకుంటారు. తెలంగాణలో దసరాని తొమ్మిది రోజులు జరుపుకుంటారు.
ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకీ మహిళలు పట్టు పీతాంబరాలు, నగలు నట్రాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజుకు చరిత్రలో మూడు పురాణగాథలు ఉన్నాయి. రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం నుంచి తిరిగొస్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు.
అలాగే జగన్మాత అయిన కాళికామాత మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి, అతనిని వధించి జయాన్ని పొందిందని, పదో రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు. ఈ విశిష్ట రోజున రావణ వధకు చిహ్నంగా అతని దిష్టిబొమ్మ దహనం, పాండువుల విజయానికి సంకేతంగా జమ్మి ఆకుల పూజ చేయటం ఆనవాయితీ. అయితే దసరా పండుగను దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు.
పశ్చిమబెంగాల్లో ముఖ్యంగా కోల్కతాలో ‘దుర్గా పూజ’ పేరుతో, కర్ణాటకలో చాముండేశ్వరీదేవని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. తెలంగాణలో మాత్రం జమ్మి చెట్టు పూజ మొదలు.. పాలపిట్టను చూసి తరించడం సాంప్రదాయం. ఎంతటి పేదవారైన ఉన్నదానిలో కొత్త బట్టలు ధరించి రుచికరమైన పదార్థాలతో భోజనం చేయడం దసరా పండుగ విశిష్టత. ఇంతేకాక కనిపించిన ప్రతి ఒక్కరినీ అలయ్ బలయ్తో ఆలింగనం చేసుకొనడం ఒక ప్రత్యేకత.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో దసరా పండుగ సందర్భంగా అలయ్ బలయ్కి మారుపేరైన బండారు దత్తన్న ఆధ్వర్యంలో ఈ ఘనమైన వేడుక గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ వేడుక తెలంగాణకు ఒక కలికి తురాయి వంటిది.
మా స్వగ్రామం పెద్దపల్లి జిల్లా కొలనూరులో వేణుగోపాల స్వామి గుడి నుంచి ఉత్సవ విగ్రహాలతో గ్రామస్తులందరూ ఊరేగింపుగా ఊరిబయట నెలకొల్పిన జమ్మి చెట్టు వద్దకు చేరుకొంటారు. అనంతరం ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహభరితంగా పండుగ చేసుకుంటారు. విజయానికి చిహ్నం దసరా పండుగ
దండంరాజు రాంచందర్రావు, 9849592958