వేషం వినూత్నం.. సందేశం సామాజికం!
- మూఢనమ్మకాలపై సమరం.. మత్తు పదార్థాలపై చైతన్యం
- ట్రాఫిక్ నిబంధనల నుంచి ఆరోగ్య పరిరక్షణ వరకు..
- మార్పు మనతోనే మొదలు.. బాధ్యత మనందరిదీ..
- ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ కొంగొత్త ప్రచారం
పాఠశాలకు(School) సెలవు వచ్చిందంటే చాలు..ప్రజల మధ్యకు పరుగుతీస్తాడు. సమాజ హితమే ఆశయంగా, సామాజిక రుగ్మతలను రూపుమాప డానికి ప్రచార సాధనంగా మారుతాడు. మూఢనమ్మకాల సంకెళ్లను తెంచడానికి.. రోడ్డు ప్రమాదాల నివారణపై(Prevention of Road Accidents) అవగాహన కల్పించడా నికి..విభిన్న వేషధారణలతో ఆకట్టుకుంటాడు. మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలను వినూత్నంగా వినిపిస్తాడు. ఇలా సమాజాన్ని చైతన్యపరిచే లక్ష్యంతో..
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు(Government teacher) నవతరంగమై విజ్ఞాన బాటలేస్తూ.. పయనిస్తున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో జరిగే వారాంతపు సంతల్లో, జాతర వేడుకల్లో జన సమూహం అధికంగా ఉండే ప్రాంతాల్లో తన అభినయంతో అలరిస్తున్నాడు. విభిన్నమైన వేషధారణలతో తనదైన శైలితో ప్రజలకు సామాజిక సందేశాలను అంది స్తున్నాడు.. ఇలా ప్రత్యేకతను చాటుతూ.. భావితరాలకు కొత్తపునాదులు వేస్తూ.. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ.. ఆదర్శానిస్తూ.. అందరిలో స్ఫూర్తి నింపుతున్నాడు.. సూర్యాపేట జిల్లాకు చెందిన రాచకొండ ప్రభాకర్. సరికొత్త పబ్లిసిటీతో సమాజంలో ప్రభవిస్తూ.. మేలుకొల్పుతున్నాడు.
వినూత్న వేషధారణ.. విస్తృత ప్రజాచైతన్యం!
సాధారణంగా సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు ఉపన్యాసాలు, కరపత్రాల పంపిణీకి పరిమితమవుతుంటాయి. ఇందుకు భిన్నంగా రాచకొండ ప్రభాకర్ వినూత్న వేషధారణలను ప్రచార సాధనాలుగా మలుచుకుంటున్నారు. ప్రజలు అత్యధికంగా గుమిగూడే ప్రాంతాల్లో పర్యటిస్తూ సామాజిక సమస్యలను వివరిస్తున్నారు.
తన వేషధారణతో ప్రజల దృష్టిని ఆకర్షించి, అనంతరం వారి ఆలోచనలను ప్రభావితం చేసే సందేశాలను అందిస్తున్నారు. వినూత్నతను మాజిక బాధ్యతకు జోడిస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు.
మూఢనమ్మకాలపై అవగాహనాస్త్రం!
మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, సామాజిక దురాచారాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేం దుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి విషయాన్నీ విచక్షణతో పరిశీలించాలని, అవాస్తవ నమ్మకాలకు లోనుకాకుండా హేతుబద్ధంగా ఆలోచించా లని సూచిస్తున్నారు. సమాజ అభ్యున్నతికి ఆటంకంగా మారే రుగ్మతలను విడనాడాలని పిలుపునిస్తున్నారు.
మత్తు మహమ్మారిపై సమరం
మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్నే కాకుండా కుటుంబ జీవితాన్ని, ఆర్థిక స్థితిగతులను, సామాజిక సంబంధాలను సైతం దెబ్బతీస్తాయని ప్రభాకర్ వెలుగెత్తి చాటుతున్నారు. తన సన్నిహిత సహచరుడి అకాల మృతి ఇందుకు కారణమంటూ ప్రజలకు వివరిస్తున్నారు. మద్యపానం వల్ల కాలేయ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయని, ప్రమాదాల ముప్పు ఉంటుం దని బోధిస్తున్నారు.
ధూమపానం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం అధికంగా ఉంటుందని నచ్చజెప్పుతు న్నారు. మత్తు పదార్థాల వినియోగంతో శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు వ్యసనానికి దారితీస్తుందని యువ తరానికి హితబోధ చేస్తూ.. హెచ్చరిస్తున్నారు. వ్యసనాలకు బానిసలై జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకోవద్దని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని మేలుకొలుపు సందేశమిస్తున్నారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ.. దిశానిర్దేశం చేస్తున్నారు.
ట్రాఫిక్ నిబంధనలే ప్రాణరక్షణ కవచాలు!
అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, హెల్మెట్ ధరించకపోవడం, సీటుబెల్టు పెట్టుకోకపోవడం వంటి నిర్లక్ష్యాలు రోడ్డు ప్రమాదాలకు కారణమవు తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనల ప్రాధాన్యాన్ని ప్రభాకర్ వివరిస్తున్నారు. రహదారి భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, నిబంధనల పాటింపుతో అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చని ప్రభవిస్తున్నారు.
మార్పు మనతోనే మొదలు.. బాధ్యత మనందరిదీ!
సామాజిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలతోపాటు ప్రజల్లో అవగాహన, బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరం. వ్యసనాలకు దూరంగా ఉండటం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, మూఢనమ్మకాలను విడనాడటం వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రభాకర్ చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయం. మార్పు మనతోనే మొదలవ్వాలి.. బాధ్యత మనందరిదీ! అంటూ.. విభిన్న వేషధారణతో దృష్టిని ఆకర్షిస్తూ..
సకల జనుల హిత సందేశంతో ఆలోచనను రేకెత్తిస్తూ.. సామాజిక మార్పే లక్ష్యంగా సాగుతున్న రాచకొండ ప్రభాకర్ ప్రస్థానం ప్రజాచైతన్యానికి ఓ వినూత్న చిరునామాగా నిలుస్తోంది. నవతరాలకు, యువతరాలకు, భావితరాలకు జ్ఞానధారవుతుంది. విజ్ఞానమై.. విచక్షణై.. విశ్లేషణై ప్రభాకర్ చైతన్య ప్రభాతం ప్రభవిస్తుంది.
బండి సంపత్ కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి
సమాజమే పాఠశాల..చైతన్యమే జీవకళ
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విద్యాబోధన బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు సమాజంలోనూ మార్పు తీసుకురావాలనే సంకల్పంతో రాచకొండ ప్రభాకర్ సాగిస్తున్న ప్రచారం ప్రత్యేకతను సంతరించుకుంది. మూఢనమ్మకాల నిర్మూలన నుంచి ఆరోగ్య పరిరక్షణ వరకు, రోడ్డు భద్రత నుంచి సామాజిక బాధ్యతల వరకు విభిన్న అంశాలను మేళవిస్తూ.. ప్రజల చెంత వివరిస్తున్నారు. సమాజమే పాఠశాలగా భావించి.. చైతన్యమే తరగతి గదిగా తలచి.. జీవకళతో నవజీవన పాఠాలను నేర్పుతున్నారు.