పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేసుకోవాలి...

29-09-2026 | 03:08pm

జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు

ములుగు, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): జిల్లాలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో(MLC Voters' List) ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్(District Collector Bhorkade Hemant) సహదేవరావు అన్నారు. మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వరంగల్- ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ  ఓటర్ల జాబితాలో పట్టభద్రులైన ఓటర్లు ఓటరుగా నమోదు చేసుకోవడంపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడంపై అవగాహన కల్పించాలన్నారు. కొత్తగా ఓటరు గా నమోదు కోసం గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు ఫారం 18 ద్వారా అన్ని వివరాలను నింపి గెజిటెడ్ అధికారి లేదా డిసిగ్నేటెడ్ అధికారి ద్వారా సంతకం చేసిన ధ్రువపత్రాన్ని  సంబంధిత  అధికారులకు సమర్పించాలన్నారు. నవంబర్ 1 2023 కంటే ముందు పట్టభద్రులైన వారు,

ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో స్థానిక నివాసులై ఉన్నవారు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. అర్హులైన పట్టభద్రులు తమ సంబంధిత మండల తహసీల్దార్లు, సహాయ ఓటరు నమోదు అధికారులు, నియమిత అధికారులను సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. దరఖాస్తుతో పాటు విద్యార్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, అవసరమైన ఇతర పత్రాలను జతచేయాలని సూచించారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్ [https://ceotelangana.nic.in/](https://ceotelangana.nic.in/) ను సందర్శించవచ్చని తెలిపారు. పాత ఓటరు జాబితాలో పేరు ఉండటం ఒక్కటే ప్రస్తుత ప్రక్రియలో నమోదుకు సరిపోదని, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఓటరు జాబితాల తయారీ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్ రెవిన్యూ ఆఫీసర్ వి. రవి కుమార్, ఎలక్షన్ సెల్ డిటిలు నితీష్, గణపతి, సతీష్, వివిధ పార్టీల ప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు