సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
- పాత్రికేయులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది
- అభివృద్ధిలో పాత్రికేయుల సూచనలు, సలహాలు కీలకం
- మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ పాత్రికేయులతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మంథని, సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి) పాత్రికేయుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం (Congress People's Government)ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు మంగళవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహావాది సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యులు పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం మంథని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని మంత్రి పాత్రికేయులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై విలువైన సూచనలు, సలహాలు అందించాలని కోరారు.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పాత్రికేయులు వారధిగా పనిచేస్తున్నారని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో వారి పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షుడు అక్కల నారాయణ, మంత్రి మండల అధ్యక్షుడు ఏగోలపు సంతోష్ గౌడ్, సభ్యులు మాదేశి శ్రావణ్ కుమార్, కాశీపేట శ్రీకాంత్, ఎండీ. సుభాన్, మంథని లక్ష్మణ్‌తో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.