ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా భరోసా

21-11-2026 | 07:21pm

కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి ప్రభుత్వం అండ

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క

ములుగు, నవంబర్ 20 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా భరోసా(Life Insurance Assurance) కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క(Seetakka) అన్నారు. శనివారం ములుగు మండలం ఇంచెర్ల గ్రామంలోని రైతువేదికలో మంత్రి సీతక్క ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుటుంబాన్ని పోషించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దీర్ఘకాలిక భరోసా కల్పించే ఉద్దేశంతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారిలో ప్రతి కుటుంబం నుంచి ఒకరి పేరును నమోదు చేసుకోవచ్చని, నామినీ వివరాలను కూడా నమోదు చేయాలని సూచించారు.

ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం ఏదైనా పథకం నిబంధనల ప్రకారం బాధిత కుటుంబానికి 5 లక్షల బీమా అందుతుందని వివరించారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు, సహజ మరణానికి 2 లక్షల బీమా సౌకర్యం ఇప్పటికే ఉందని, ఆ ప్రయోజనాలు కూడా కొనసాగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ ములుగు డివిజన్ చైర్మన్ రవీందర్ రెడ్డి, సీపీఓ, సర్పంచులు , సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు