గులాబీ తోటలో కన్నీటి గాధలు!

27-10-2026 | 05:20am
  1. పార్టీ గెలుపు కోసం పోరాడే సైనికుల వద్దే చందాలు
  2. కోట్లాస్తులున్నా బలవంతపు వసూళ్లు
  3. అలయ్ బలయ్ పేరుతో ఒక్కొక్కరి నుంచి వెయ్యి టోకెన్ రుసుము
  4. నాయకుడి రిసార్ట్‌లోనే కార్యకర్తల కన్నీటి గోడు
  5. పార్టీ కోసం పనిచేసే వారిపైనే ఖర్చుల భారం
  6. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా అలయ్‌బలయ్

నాగర్ కర్నూల్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): గులాబీ జెండా మోసేది కార్యకర్త.. నాయకుడి(Activist.. leader) కోసం నినదించేది కార్యకర్త.. పార్టీ గెలుపు కోసం సోషల్ మీడియాలో(Social Media) సెల్ ఫోన్లతో(cell phones) కుస్తీ పడుతూ అహర్నిశలు శ్రమించేది కూడా కార్యకర్త.. మరి అదే కార్యకర్తకు పార్టీ సమావేశానికి వెళ్లాలన్నా చందాలు చెల్లించాల్సిన పరిస్థితి రావడం ఏంటని ఆ పార్టీ సైనికులు మదన పడుతున్నారు.

సుమారు రూ.1,500 కోట్ల ఆస్తులున్న పార్టీగా చెప్పుకుంటున్న బీఆర్‌ఎస్లో కార్యకర్తల నుంచి సమావేశం పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ.1,000 చొప్పున వసూలు చేసినట్లు వస్తున్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ నెల 25న హైదరాబాద్లోని ఓ నాయకుడి రిసార్ట్లో నిర్వహించిన అలయ్ బలయ్ సమావేశానికి హాజరయ్యేందుకు చందాతోపాటు రానుపోను ప్రయాణ ఖర్చులు కూడా కార్యకర్తలే భరించాల్సి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

చందా కట్టిన వారికే ఎంట్రీ.

పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహించిన సమావేశానికి అందరినీ ఆహ్వానించకుండా, డబ్బులు చెల్లించిన కొందరికే అవకాశం కల్పించారన్న అసంతృప్తి కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. నాగర్ కర్నూల్(Nagarkurnool), అచ్చంపేట నియోజకవర్గాల నుంచి కేవలం 20మందికి మించి సమావేశానికి వెళ్లలేకపోయారని, ప్రయాణ ఖర్చులతో కలిపి భారం పెరగడంతో మరికొందరు వెనక్కి తగ్గారని తెలుస్తోంది. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తూ, ఎన్నికల(Elections) సమయంలో నాయకుల వెంట తిరుగుతూ, ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టే కార్యకర్తలకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై జిల్లాలోని గులాబీ శ్రేణుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.

రిసార్ట్‌లో కార్యకర్తల గోడు

నాయకుడి రిసార్ట్లో జరిగిన సమావేశం కార్యకర్తల్లో ఉత్సాహం నింపాల్సింది పోయి, వారి ఆర్థిక ఇబ్బందులు, అసంతృప్తిని చర్చకు తెచ్చిందన్న ప్రచారం సాగుతోంది. పార్టీ కోసం సొంత డబ్బులు ఖర్చు చేస్తూ కార్యక్రమాలకు హాజరవుతున్న తమను గుర్తించడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

ఆస్తులున్నా తప్పని అవమానాలు

పార్టీకి భారీగా ఆస్తులు, నిధులు ఉన్నాయని చెబుతున్న నాయకత్వం.. కార్యకర్తల సమావేశాల ఖర్చులను భరించలేక ప్రతి కార్యక్రమానికి కార్యకర్తలే తమ జేబుల నుంచి డబ్బులు ఆర్జించడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం సమయాన్ని, శ్రమను, ఆర్థిక వనరులను వెచ్చించే సాధారణ కార్యకర్తలకు కనీస ప్రాధాన్యం ఇవ్వకపోతే, వారిలో ఉత్సాహం ఎలా నిలుస్తుందన్న చర్చ మొదలైంది.ఎన్నికల సమయంలో జన సమీకరణకు కార్యకర్తలు కావాలి.. సభలకు జనం కావాలి.. ప్రచారానికి పార్టీ శ్రేణులు కావాలి.

కానీ వారి ఆర్థిక ఇబ్బందుల విషయంలో నాయకత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా అన్న ప్రశ్నలు గులాబీ శిబిరంలో వినిపిస్తున్నాయి. కార్యకర్తల త్యాగాలను ప్రసంగాల్లో కొనియాడటం ఒక ఎత్తయితే, ఆచరణలో వారికి అండగా నిలవడం మరో ఎత్తు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలంటే ముందుగా కార్యకర్తల్లో విశ్వాసం నింపాల్సిన అవసరం ఉంది.

వారి కష్టాన్ని గుర్తించి, ఆర్థిక భారాన్ని తగ్గించి, సముచిత గౌరవం ఇచ్చినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యమవుతుందనే వాదన వినిపిస్తోంది. జెండా మోస్తూ జై కొట్టి ఖర్చు పెట్టేది కూడా కార్యకర్తలేనని చివరకు సొంత పార్టీ నేతల నుండే అవమానాలను భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు