అచ్చంపేట అభివృద్ధికి సీఎం హామీ.. 26న CM పర్యటన
* సాగునీటి ప్రాజెక్టులపై కీలక ప్రకటనల ఆశలు
* రూ.133 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
* మద్దిమడుగులో సంత్ సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ
అచ్చంపేటలో భారీ బహిరంగ సభ
అచ్చంపేట, నవంబర్ 22 (విజయక్రాంతి): అచ్చంపేట నియోజకవర్గ(Achampeta Constituency) అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక దృష్టి సారించారని, ఈ నెల 26న ఆయన పర్యటనతో ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ లభించనుందని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ఉమామహేశ్వర, చెన్నకేశవ రిజర్వాయర్లు(Chennakesava Reservoirs), ఎత్తిపోతల పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్‌లో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో(MLA Dr. Chikkudu Vamsikrishna) కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పర్యటన సాగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న అధికారంలోకి వస్తామనే ప్రకటనలు నీటిపై రాతలేనని విమర్శించారు.
రాహుల్‌గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన మల్లు రవి, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, ఓటు హక్కుల రక్షణ కోసం రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాటాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యల అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లారని, పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలపై అధిష్ఠానం తగిన చర్యలు పరిశీలిస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 100కు పైగా స్థానాలతో విజయం సాధించి, రేవంత్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
రూ.133 కోట్ల పనులకు శంకుస్థాపనలు
ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి మద్దిమడుగుకు చేరుకుని సంత్ సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. పబ్బతి ఆంజనేయస్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.25 కోట్లు, హరిత హోటల్ నిర్మాణానికి రూ.15 కోట్లు, సంత్ సేవాలాల్ అభివృద్ధికి రూ.38 కోట్లు, రహదారి విస్తరణకు రూ.55 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు అచ్చంపేట వై జంక్షన్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
సభలో మహిళలకు చిలకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అమరాబాద్, పదర, అచ్చంపేట, బల్మూరు, లింగాల, తెలకపల్లి మండలాలకు సాగునీరు అందించేలా ఉమామహేశ్వర, చెన్నకేశవ రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు చెప్పారు. అచ్చంపేటకు 0.1 టీఎంసీ నీటిని కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, సాగునీటితో పాటు విద్యా, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు.