వీబీ రాంజీ పనులపై ఆకస్మిక తనిఖీ

13-11-2026 | 04:38pm

చిట్యాల, నవంబర్ 13 (విజయక్రాంతి): చిట్యాల మండలం(Chityala Mandal) ఉరుమడ్ల గ్రామంలో విబి రాంజీ పథకం(VB Ramji Scheme) కింద బోడగుట్ట వద్ద చేపడుతున్న కందకాల పనులను నల్లగొండ జిల్లా డీఆర్డీఓ అదనపు పీడీ హరీష్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీల హాజరును ఉదయం 8 గంటలలోపే నమోదు చేయాలని సూచించారు. కూలీలకు రోజుకు రూ.308 వేతనం అందేలా కొలతలు నమోదు చేయాలని మేట్లకు సూచించారు.

కూలీలు నిర్ణీత సమయానికి పనులకు హాజరై, నిర్దేశించిన కొలతల ప్రకారం పనులు పూర్తి చేయాలని తెలిపారు. జలసిరి పనులపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రతి చిన్న, సన్నకారు రైతు తమ పొలాల్లో నీటి కుంటలు, నీటి నిల్వ పనులు చేపట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేసేలా సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా ఉపాధి పనులకు రావడానికి ఆసక్తి చూపే ప్రతి కూలీకి పని కల్పించాలని, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు సైతం ఉపాధి పనులకు వస్తే అవకాశం కల్పించాలని సూచించారు. గ్రామంలో ఎక్కువ మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ మహేందర్ రెడ్డి, ఎంపీడీవో జెల్ల పాండు, ఎంపీఓ కోటేశ్వరరావు, సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం, ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, మేట్లు జనపాల మల్లిక, రూప, వనజ, రాసమల్ల సంధ్య, రాసమల్ల అజంతా, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు