28 March, 2026 | 4:22 AM

217 కోట్ల దోపిడీ రూ.1,472 కోట్ల నకిలీ లావాదేవీలు

28-03-2026 02:27 AM
  1. తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ భారీ కుంభకోణం బట్టబయలు

హైదరాబాద్ కేంద్రంగా ఏపీ, తెలంగాణలో 72 షెల్ కంపెనీలు

ఫేక్ బిల్లుల సృష్టించి, ఐటీసీ పేరిట ప్రభుత్వ ఖజానాకు గండి

ఏకకాలంలో దాడులు చేసిన డీజీజీఐ

హైదరాబాద్, సిటీ బ్యూరో మార్చి 27 (విజయక్రాంతి): ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ.. పన్ను ఎగవేతదారులు సాగిస్తు న్న భారీ దందా ఒకటి వెలుగుచూసింది. ఎలాంటి వ్యాపారం చేయకుండానే కాగితాలపై వందల కోట్లు సృష్టించి ట్యాక్స్ ఎగ్గొడుతున్న భారీ ఉదంతాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు గుట్టురట్టు చేశారు.

హైదరాబాద్ కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 1,472 కోట్ల నకిలీ లావాదేవీలు జరిగినట్టు, రూ.217 కోట్లను దోపిడీ చేసినట్లు తేల్చారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన డీజీజీఐ అధికారుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. పన్ను ఎగవేతదారులు ఏపీ, తెలంగాణలో ఏకంగా 72 నకిలీ షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఓ భారీ నెట్‌వర్క్‌ను సృష్టించారు.

క్షేత్రస్థాయిలో ఎలాంటి వస్తువుల సరఫరా గానీ, సేవల వినిమయం గానీ జరగలేదు. కానీ, కేవలం నకిలీ డాక్యుమెంట్లు, ఫేక్ బిల్లులతో ఏకంగా రూ.1,472 కోట్ల భారీ మొత్తంలో కృత్రిమ లావాదేవీలు జరిగినట్లుగా కాగితాలపై సృష్టించారు. దీం తో ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని ఎగ్గొట్టడమే కాకుండా.. నిందితులు రివర్స్ గేర్‌లో ప్రభుత్వ ఖజానాకే కన్నం వేశారు. ఈ రకం గా ఏకంగా రూ.217 కోట్ల మేర ఇన్‌కమ్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ భారీ నెట్‌వర్క్ దందాపై ఉప్పందిన డీజీజీఐ అధికారులు పక్కా వ్యూ హంతో రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయాలతో పాటు ఏపీ, తెలంగాణలోని పలు కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టారు.

ఈ తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్ కాపీలు, హార్డ్ డిస్క్లు, ల్యా ప్టాప్లు సహా అత్యంత కీలకమైన డిజిటల్ సా క్ష్యాధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నా రు. ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరన్న దానిపై విచారణ జరుపుతున్నారు.