పంట మార్పిడి వైపు ఆలోచించి లాభాలు ఆర్జించాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): రైతులకు దీర్ఘకాలంగా లాభాలను ఆర్జించిపెట్టే పామాయిల్ సాగుపై అవగాహన కల్పించి జిల్లాలో పామాయిల్ సాగు పెంచే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వనపర్తి జిల్లాలో ఈసంవత్సరం పామాయి సాగు లక్ష్యం 3 వేల ఎకరాలు సాధించే విధంగా రైతులకు ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఈ సంవత్సరంలో ఆయిల్ మిల్ కంపెనీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఒకసారి సాగు చేస్తే రైతులకు దీర్ఘ కాలం 30-40 సంవత్సరాల వరకు లాభాలను ఆర్జించిపెట్టే పామాయిల్ సాగు వైపు రైతులను మళ్లించాలన్నారు. ఇందుకు ఒక్కో వ్యవసాయ విస్తీర్ణాధికారుకి 20 మంది రైతులను ప్రోత్సహించే విధంగా లక్ష్యాలను నిర్దేశించారు.
ఉద్యాన శాఖ అధికారులకు ఒక్కొక్కరికి వంద మంది రైతులు పామాయిల్ సాగు చేసే విధంగా చూసేందుకు లక్ష్యాలను నిర్దేశించారు. సబ్సిడీ పై పామాయిల్ మొక్కలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, ప్రియునిక్ కంపెనీ వారితో సమన్వయం చేసుకొని అన్ని రైతు వేదికల్లో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు.




