18 August, 2026 | 2:38 AM

జిల్లాలో 10,71,566 ఓట్లు రద్దు

18-08-2026 01:46 AM
  1. రికార్డు స్థాయిలో 35.96 శాతం తగ్గనున్న ఓటర్లు 
  2. ముసాయిదా జాబితా విడుదల చేసిన అధికారులు 
  3. వచ్చేనెల 16 వరకు అభ్యంతరాల స్వీకరణ 
  4. అక్టోబర్ 19న తుది జాబితా 

మేడ్చల్, ఆగస్టు 17 (విజయ క్రాంతి): భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) లో భాగంగా ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చే శారు. ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలోని ఐదు అ సెంబ్లీ నియోజకవర్గాలలో 1071566 ఓట్లు రద్దుకానున్నాయి. జిల్లాలో 2979130 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1071566 ఓట్లు రద్దు కాగా, 1907564 మంది ఓటర్లతో ము సాయిదా జాబితా విడుదల చేశారు.

జిల్లాలో 35.96 శాతం ఓట్లు తగ్గడం గమనార్హం. తుది జాబితా సమయానికి జిల్లా ఓటర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎన్నిమరేషన్ పారాల సమర్పణ గడువు ఈనెల 10వ తేదీన ముగిసింది. ఆరోజు అధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం 1073705 రద్దయ్యే అవకాశం ఉండగా, ముసాయిదా జాబితా ప్రకారం 1071566 ఓట్లు రద్దు అవుతున్నాయి. 

నియోజకవర్గాల వారీగా..

మేడ్చల్ నియోజకవర్గం లో 677381 ఓటర్లు ఉండగా ముసాయిదా జాబితా ప్రకారం 213122 ఓట్లు రద్దు అవుతాయి.464259 మంది ఓటర్లు ఉంటారు. మల్కాజిగిరిలో 513144 మంది ఓటర్లు ఉండగా 192957 ఓట్లు రద్దు అవుతున్నాయి.320187 మంది ఓటర్లు ఉంటారు.

కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో 747427 మంది ఓటర్లు ఉండగా 276924 ఓట్లు రద్దు అవుతున్నాయి.470503 ఓటర్లు ఉంటారు. కూకట్పల్లి నియోజకవర్గం లో 493408 ఓటర్లు ఉండగా 170240 రద్దు అవుతున్నాయి.323168 ఓటర్లు మిగులుతారు. ఉప్పల్ నియోజకవర్గంలో 547770 మంది ఓటర్లు ఉండగా 218323 ఓట్లు రద్దు అవుతున్నాయి.329447 మంది ఓటర్లు ఉంటారు. 

16వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ 

ముసాయిదా జాబితాలో తప్పులు ఉంటే వచ్చేనెల 16వ తేదీ వరకు ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 15వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరిస్తారు. అక్టోబర్ 19వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.

రాష్ట్రంలోనే కుత్బుల్లాపూర్‌లో అత్యధిక ఓటర్లు..

మేడ్చల్, ఆగస్టు 17(విజయ క్రాంతి): రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా కుతుబుల్లాపూర్ గుర్తింపు పొందింది. గతంలో రెండవ స్థానంలో ఉండగా ముసాయిదా జాబితా ప్రకారం మొదటి స్థానానికి చేరింది. గతంలో మూడవ స్థానంలో ఉన్న మేడ్చల్ నియోజకవర్గం రెండో స్థానానికి చేరింది.

గతంలో మొదటి స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం మూడో స్థానానికి చేరింది. ముసాయిదా జాబితా ప్రకారం కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో 470503, మేడ్చల్ నియోజకవర్గంలో 464259, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 443544 మంది ఓటర్లు ఉన్నారు.