18 August, 2026 | 2:27 AM

సర్కారు అధికారిక గుర్తు మెఘా కబ్జా!

18-08-2026 01:49 AM
  1. టిమ్స్ ప్రకటనలో ప్రభుత్వ గుర్తు 
  2. కొన్ని పత్రికలకు ప్రభుత్వ గుర్తుతో.. మరికొన్నింటికి గుర్తు లేకుండా.. 
  3. ప్రభుత్వ లోగో వాడే అధికారం ఎవరిచ్చారు? 
  4. పకటనల ఖర్చు ఎవరిది?

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ఆంధ్రా ప్రాంతానికి చెందిన బడా కాంట్రాక్టు కంపెనీలు రాష్ట్రంపై అజమాయిషీ కొనసాగిస్తున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తెలంగాణ సర్కార్ కూడా ఏ పని చేపట్టినా ఆంధ్రా కాంట్రాక్టర్లకే ప్రాధాన్యమిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సనత్‌నగర్‌లోని టిమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పత్రికలకు ఇచ్చిన ప్రకటలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి.

కొన్ని ప్రకటనల్లో ప్రభుత్వం అధికారికంగా ఉపయోగించే గుర్తు, వైద్య ఆరోగ్య శాఖ పేరు కనిపించగా.. మరికొన్ని పత్రిలకకు అదే ప్రకటన ప్రైవేట్ సంస్థ ప్రచారంగా వెలువడింది. దీంతో అసలు ఈ ప్రకటనలు ఎవరి తరఫున జారీ అయ్యాయి? ఖర్చు ఎవరు భరించారు? ప్రభుత్వ గుర్తును ప్రైవేటు కంపెనీ ఎలా వినియోగించింది? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ప్రభుత్వ సొమ్ము.. ప్రైవేటు ప్రచారం

హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రి సోమవారం ప్రారంభోత్సవం సందర్భంగా పలు పత్రికలకు ప్రకటనలు (అడ్వర్టుజ్‌మెంట్) ఇచ్చారు. నిజానికి ప్రభుత్వ కార్యక్రమం అయితే ప్రభుత్వమే సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా పత్రికలకు ప్రకటనలు ఇస్తుంది.

అలా కాకుండా.. పనులు చేసిన ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ అయితే సంస్థ తరఫున సొంతంగా ప్రకటనలు ఇచ్చుకుంటుంది. కానీ సోమవారం నాడు పలు పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో పూర్తిగా విరుద్ధమైన ప్రకటనలు ఇవ్వడం గమనార్హం.

ప్రభుత్వం సొమ్ముతో ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ ప్రచారం చేసుకున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా దీనికి ప్రభుత్వం అధికారిక గుర్తును ఉపయోగించడం గమనార్హం. అంటే ప్రభుత్వంపై ప్రైవేటు కంపెనీ అజమాయిషీ చేస్తోందా.. ఇలా చేయడం వల్ల.. ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సోమవారం  పలు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.

కొన్ని పత్రికల్లో ప్రభుత్వ అధికారిక గుర్తుతో ప్రకటనలు వచ్చాయి. తెలంగాణ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ పేరును కూడా వాడుకున్నారు. అయితే ప్రభుత్వం ఈ ప్రకటన జారీచేస్తే.. ప్రైవేటు కాంట్రాక్టు కంపెనీ పేరును ప్రముఖంగా ప్రచురించడం ఇక్కడ గమనార్హం. అదే మరికొన్ని పత్రికల్లో ప్రభుత్వ అధికారిక గుర్తు లేకుండానే ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ ప్రకటనలా కపడేలా ఇచ్చారు. అంటే ఒకే ప్రకటనను.. రెండు విధాలుగా ఎలా ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తప్పుడు ప్రకటనలతో ప్రజల్లో గందరగోళం

ఒకవేళ ప్రభుత్వం సొమ్ముతో ప్రకటన జారీచేస్తే.. ప్రైవేటు కాంట్రాక్టు సంస్థకు అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. పోనీ ప్రైవేటు కాంట్రాక్టు సంస్థనే ప్రకటనలు ఇస్తే.. ప్రభుత్వ అధికారిక గుర్తును వాడుకోవడం సరైందేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రకటనల ఖర్చు ప్రభుత్వానిదా.. లేక ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ భరిస్తుందా అనేది తేలాల్సి ఉంది.

ఏదేమైనా ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ పేరుతో ‘మెగా’ ప్రచారం చేసుకున్నట్టుగా మాత్రం ఆ ప్రకటన చూస్తే అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఎటొచ్చీ ప్రభుత్వ అధికారి గుర్తును వాడుకోవడంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. అంటే.. ప్రభుత్వ గుర్తును ‘మెఘా’ కబ్జా చేసి.. ప్రజలను తప్పుదారి పట్టించినట్టు కాదా అంటు పలువురు ప్రశ్నిస్తున్నారు.