తెలంగాణకు మొండిచేయి!
- బీజేపీ జాతీయ నూతన కార్యవర్గంలో ఒక్కరికీ దక్కని ఛాన్స్
- ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా ముగ్గురికి చోటు
- తెలంగాణ నేతలకు షాకిచ్చిన జాతీయ నాయకత్వం
- కేంద్ర క్యాబినెట్‌లో చోటుకోసమే ఇప్పుడు పక్కనపెట్టారా?
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): బీజేపీ నూతన జాతీయ కార్య వర్గంలో తెలంగాణకు మొండిచేయి దక్కింది. ఏ ఒక్కరిని కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించలేదు. అయితే పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ముగ్గురికి చోటు కల్పించారు. 13 మంది జాతీయ ఉపాధ్యక్షుల తో పాటు వివిధ పదవులకు ఎంపికైన వారి జాబితాను సోమవారం బీజేపీ ప్రకటించింది. జాతీయ కార్యవర్గంలో తెలం గాణ నుంచి పదవులు ఎవరికీ దక్కకపోవడంతో పార్టీలో చర్చమొదలైంది.
దీని వెనుకాల జాతీయ నాయకత్వం వ్యూహమేమిటనే అంచానాను ఎవరికివారు వేసుకుంటున్నారు. జాతీయ కార్యవర్గంలో కీలక పదవులు వస్తాయని ఆశిం చిన వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే జాతీయ కార్యవర్గంలో చోటు దక్కకపోవడంతో.. త్వరలో జరగబోయే కేంద్ర క్యాబినేట్ పునర్వ్యవస్థీకరణలో తెలంగాణ నుంచి నేతలకు చో టు దక్కే అవకాశాలున్నట్లుగా తెలుస్తోది.
గతంలో బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఓబీసీ మోర్చా అధ్యక్షుడుగా ఎంపీ డా. కే లక్ష్మణ్‌కు చోటుదక్కితే జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎంపీ డీకే అరుణ, జాయింట్ సెక్రటరీగా బండి సంజయ్ ఉన్నారు. ఈసారి మాత్రం వీరికే కాదు. ఏ ఒక్కరికీ అవకాశం దక్కలేదు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఒకరు రాజ్యసభ సభ్యులున్నారు. వీరితోపాటు కీలక నేతలు, ఆశావహులు ఎంద రో ఉన్నారు.
వీరంతా తమకు జాతీయ కార్యవర్గంలో కీలక పదవులు లభిస్తాయని ఆశించారు. కానీ ఏ ఒక్కరికీ చోటు కల్పించకుండా జాతీయ నాయకత్వం వీరికి ట్విస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. ఏపీ మీద ఎక్కువగా జాతీయ పార్టీ ఫోకస్ చేసినట్లుగా ఉంది. ఈక్రమంలోనే జాతీయ కార్యవర్గంలో ఏపీ నుంచి ఏకంగా ముగ్గురికి చోటు లభించింది. జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, రామ్‌మాధవ్‌ను తీసుకోగా, ఆల్‌సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్స్‌గా విష్ణువర్ధన్ రెడ్డికి చోటు కల్పించారు.
పార్టీలో కీలక నేతగా ఉన్న ఎంపీ డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి నుంచి తప్పించి ఆమె స్థానంలో ఏపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరికి అవకాశమిచ్చారు. గుజరాత్, ఢిల్లీ, యూపీ నుంచి భారీగా కార్యవర్గంలో చోటు కల్పించిన జాతీయ నాయకత్వం రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణలోని నేతలకు మాత్రం చోటు కల్పించకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
జాతీయ స్థాయిలో పదవులను ఇవ్వకుండా పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడం, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కష్టమే. అయితే జాతీయ పార్టీలో సంస్థాగత మార్పులు చేసిన నాయకత్వం కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి కొత్తవారికి చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీపై ఎఫెక్ట్..
రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో పుంజుకోవడానికి రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఉద్యమ కార్యాచరణను కూడా సిద్ధం చేసుకుంది. రాబోయే రోజుల్లో ప్రజా, విద్యా, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలను ఎజెండాగా తీసుకొని పోరాటం చేయాలని భావిస్తోంది. పైగా త్వరలో గ్రేటర్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈసమయంలో బీజేపీ అధిష్ఠానం తెలంగాణ నేతలను పక్కనపెట్టడంపై స్థానిక నాయకత్వంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
పార్టీపై ప్రభావం పడే అవకాశంలేకపోలేదు. పదవులను ఆశించిన నేతలు చురుకుగా పనిచేసే అవకాశం ఉండదు. వారి అనుచరులు సైతం డీలా పడే అవకాశం ఉంటుంది. దీనిప్రభావం ఇతర పార్టీల నుంచి వచ్చే వారిపై కూడా పరోక్షంగా పడనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు ఏ సమీకరణాల ప్రకారం జాతీయ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు!.. లేక రాబోయే రోజుల్లో తెలంగాణకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తారా అన్నది పార్టీ వర్గాల్లో చర్చగా మారింది.






