రెవెన్యూ తప్పిదాలలో ఎమ్మార్వోదే హస్తం..?
- సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్న తహసీల్దార్
- జిల్లా, డివిజన్ ప్రజావాణిలో దరఖాస్తుకు స్పందించని అధికారులు
- ములుగు మండలం కమలాబాద్‌లో అసైన్డ్ భూమి వివాదం
- తమ భూమి తమకు అప్పగించాలని రైతులు వేడుకోలు
గజ్వేల్, ఆగస్టు 17: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ కుటుంబానికి ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూమి వివాదంలో చిక్కుకుందని ములుగు మండలం కమలాబాద్కు చెందిన రైతు బోయిని రమేష్ ఆరోపించారు. సర్వే కోసం పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన తల్లి బోయిని సత్తవ్వకు ప్రభుత్వం కమలాబాద్ గ్రామంలోని సర్వే నంబర్ 113/36 (సీలింగ్), 139/12/అ (అసైన్డ్)లో మొత్తం 1.33 ఎకరాల భూమిని కేటాయించింది.
సుమారు 50 ఏళ్లుగా తమ కుటుంబం ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతోందని, ఇందుకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలు కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపారు.అయితే పక్కనే ఉన్న రైతు సుజాతకు చెందిన పట్టా భూమి కొంత తక్కువగా ఉండటంతో తమ తల్లి పేరుపై ఉన్న సుమారు 38 గుంటల భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని రమేష్ ఆరోపించారు. ఈ విషయమై ప్రశ్నించిన తనపై, తన భార్యపై దాడి చేసి గాయపరిచారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
తమ భూమిని సర్వే చేసి హక్కు కల్పించాలని తహసీల్దార్ను కోరగా, భూమి గురించి అడగవద్దని, డబ్బులు కావాలంటే ఇప్పిస్తానని చెప్పినట్లు రమేష్ ఆరోపించారు. సర్వే కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో తమ వద్ద సిబ్బంది లేరని, డివిజన్ సర్వేయర్కు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించడంతో అక్కడ కూడా దరఖాస్తు చేశామని తెలిపారు. అయితే డివిజన్ సర్వేయర్ సర్వేకు రాకుండా తహసీల్దార్ అడ్డుకున్నారని ఆరోపించారు.
తమ సమస్యను పరిష్కరించాలని జిల్లా ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేయగా గజ్వేల్ ఆర్డీఓ, ములుగు తహసీల్దార్కు సమస్య పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గత నెలలో ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలోనూ దరఖాస్తు చేసినా స్పందన లేదని తెలిపారు.సోమవారం మరోసారి ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణిలో దరఖాస్తు చేయగా, జూనియర్ అసిస్టెంట్ బాల్రెడ్డి డివిజన్ సర్వేయర్కు సమాచారం ఇచ్చామని, రెండు మూడు రోజుల్లో సర్వే నిర్వహించేందుకు సంబంధిత వారికి నోటీసులు ఇస్తామని చెప్పినట్లు రమేష్ తెలిపారు.
ఆర్డీఓను కలిసి తమ సమస్యను వివరించేందుకు ప్రయత్నించగా అవకాశం ఇవ్వకుండా పంపించారని ఆరోపించారు. తమ తండ్రుల కాలం నుంచి అదే భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, అధికారులు నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించి తమ భూమిని తమకు అప్పగించాలని బాధిత రైతు బోయిని రమేష్ కోరారు. ఈ వ్యవహారంపై సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.
డీఐ ద్వారా సర్వే చేసుకోవాలని సూచించా
ములుగు మండలం కమలాబాద్ లో ప్రభుత్వ సీలింగ్, అసైన్డ్ భూములు సర్వే నెంబర్లు 113,139 లకు సంబంధించి టిప్పర్లు మండల పరిధిలో లేకపోవడం వల్ల బోయి రమేష్ ను డివిజన్ సర్వే ద్వారా సర్వే చేయించుకోవాలని సూచించాము. ఆ తరువాతే ఆయన డిఐ కి దరఖాస్తు చేసుకోగా సర్వే కోసం డీఐ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది.
- రవీందర్ రెడ్డి ములుగు తహసీల్దార్.






