రోహిత్‌వి మోదీలా నకిలీ సర్టిఫికెట్లు కావు

05-05-2024 02:12:04 AM

సైన్స్, సోషల్ సైన్సెస్‌లో జేఆర్‌ఎఫ్ సాధించాడు 

నిందితులకు శిక్ష పడేవరకు పోరాడుతా

స్పష్టంచేసిన రోహిత్ వేముల తల్లి రాధిక  

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (విజయక్రాంతి): తన కుమారుడివి కష్టపడి సాధించుకున్న మెరిట్ సర్టిఫికెట్లు అని, మోదీ డిగ్రీ సర్టిఫికెట్లలా నకిలీవి కావని రోహిత్ వేముల తల్లి రాధిక అన్నారు. తన కుమారుడి చావుకు కారణమైన వారికి శిక్ష పడాలని, రోహిత్‌కు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని స్పష్టంచేశారు. శనివారం హైదరా బాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్‌గేటు ఎదుట అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్‌ఏ) నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రోహిత్ మెరిట్ విద్యార్థి అని, సైన్స్, సోషల్‌సైన్స్‌లో జేఆర్‌ఎఫ్ సాధించాడని, ఎమ్మెస్సీ లో జనరల్ క్యాటగిరీలో ఆలిండియాలో 6వ ర్యాంకు సాధించాడని ఆమె తెలిపారు. తాను దళితురాలినని తన కుమారుడూ దళితుడేనని స్పష్టంచేశారు.

రోహిత్ కులాన్ని పోలీసులెలా నిర్దారిస్తారని, తన కుమారుడు ఎస్సీ కాదని పోలీసులు రిపోర్టులో పేర్కొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. పదోతరగతి నుంచి రోహిత్ మెరిట్ స్టూడెంట్ అని, జనరల్ క్యాటగిరీలో హెచ్‌సీయూలో అడ్మిషన్ పొందిన తన కుమారుడికి తప్పుడు సర్టిఫికెట్ల అవసరం లేదని తేల్చిచెప్పారు. సర్టిఫికెట్లు తప్పుడువైతే యూనివర్సిటీలో అడ్మిషన్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. రోహిత్ రచనలు చదివితే అతను ఎంత నేర్పరో తెలుస్తుందని చెప్పారు. బీజేపీ ఓడిపోతుందనే భయంతో, దోషులగా ఉన్న బీజేపీ నాయకులకు శిక్ష పడుతుందనే భయంతోనే ఇప్పుడు రోహిత్ కేసులో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేసును రీ ఓపెన్ చేసి, నిష్పక్షపాతంగా పునర్విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరామని చెప్పారు.

న్యాయం కోసం అవసరమైతే పై కోర్టులకు కూడా వెళతానని స్పష్టంచేశారు. రోహిత్ కేసులో పోలీ సులు ఇచ్చిన 60 పేజీల నివేదికలో 30పేజీలలో రోహిత్ ఎస్సీ కాదని చెప్పేందుకే ప్రయత్నించారని ఏఎస్‌ఏ నాయకులు విమర్శించారు. రోహిత్ చావుకు ముమ్మాటికీ బండా రు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, అప్పటి హెచ్‌సీయూ వీసీ అప్పారావు, సుశీల్‌కుమార్ స హా పలువురు ఏబీవీపీ నాయకులే కారణమని ఆరోపించారు. రోహిత్ వేములకు న్యాయం చేయాలని జరిగిన పోరాటంలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలు : ఎస్‌ఎఫ్‌ఐ

రోహిత్ వేములకు న్యాయం చేయాలని, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నేడు యూనివర్సిటీలు, జిల్లా కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చినట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, టీ నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు.

రోహిత్‌ది ముమ్మాటికీ వ్యవస్థీకృత హత్యే

పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పరశురాం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్న పరిశోదక విద్యార్థి రోహిత్ వేములది ముమ్మాటికీ వ్యవస్థీకృత హత్యేనని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మామిడికాయల పరశురాం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నాటి హెచ్‌సీయూ వీసీ అప్పారావు, ఏబీవీపీ నాయకుడు సుశీల్, బీజేపీ బడా నేత బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి స్ముతీఇరానీ, నాటి ఎమ్మెల్సీ రాంచందర్ రావుల ప్రత్యక్ష, పరోక్ష వేదింపులతోనే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. రోహిత్ ఎస్సీ కాదని, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో చదువుకున్నాడని, పోలీసులు రిపోర్టు ఇవ్వడం సిగ్గుమాలిన చర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  రోహిత్ కేసులో వాస్తవాలను వెలికి తీసి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.