2 August, 2026 | 3:13 AM

కాళేశ్వరాన్ని సరిదిద్దుతాం

02-08-2026 01:18 AM
  1. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బరాజ్‌ల నిర్మాణంలో అంతులేని అవినీతి
  2. తెలంగాణ ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు మొసలి కన్నీరు 
  3. కాంగ్రెస్ హయాంలోని ప్రాజెక్టులు చెక్కుచెదరలేదు 
  4. రైతుల పక్షపాతిగా మా ప్రజాపాలన 
  5. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు 
  6. కడెం, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులను పరిశీలించిన మంత్రుల బృందం

నిర్మల్/అర్మూర్/పెద్దపల్లి/ఖానాపూర్, ఆగస్టు 1 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టును సరిదిద్దడానికి కట్టుబడి ఉన్నామని నీటిపారుదల, పౌరసరఫరా ల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజె క్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బరాజ్‌ల నిర్మాణంలో అంతులేని అవినీతి జరిగిందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

ప్రతిపక్షాల నేతలే ఇంజినీర్లుతై బాగుండేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరలేదని స్పష్టం చేశారు. రైతుల పక్షపాతిగా ప్రజాపాలన ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. ఉత్తర తెలంగాణ సాగునీటిపై ప్రభుత్వం ఫోకస్ పెడుతోందని, రైతులకు గరిష్ఠంగా సాగునీరు ఇవ్వడమే లక్ష్య మన్నారు. గోదావరి జలాల వినియోగానికి సమగ్ర  కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల్లో పూడికతీతకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు తెలిపారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టుల పరిస్థితిని సమీక్షించేందుకు నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టును, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను, నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్‌లో గల శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌ను  మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామితో కూడిన మంత్రుల బృందం శనివారం సందర్శించి, పరిశీలించారు.

ఆయా ప్రాజెక్టుల పరిస్థితులు, సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా ప్రాజెక్టుల వద్ద మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడారు. ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందిస్తుందని, అందులో భాగంగానే ప్రధాన ప్రాజెక్టులను వరుసగా పరిశీలిస్తున్నామని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం సుందిళ్ల మేడిగడ్డ ప్రాజెక్టులు నిర్మాణంలో అంతులేని అవినీతి జరిగిందని, వేలకోట్ల రూపాయలు అప్పటి బీఆర్‌ఎస్ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల్లో నీళ్లు నిలిపితే ప్రాజెక్టుకే ప్రమాదం అని డ్యామ్ సేఫ్టీ నిపుణులు చెప్పిన నివేదిక ఆధారంగానే నీళ్లు నిలుపలేకపోతున్నామని స్పష్టం చేశారు. ఒకటి రెండు రోజుల్లో కురిసిన వర్షాలకు కాలేశ్వరం నీళ్లను చూసి మురిసిన బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారని ఆరోపించారు.

రాజకీయాలు మాని వారు ఇంజనీర్లుగా మారితే మంచిగ ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన శ్రీరాంసాగర్, కడెం నారాయణరెడ్డి, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నీ బలంగా ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ హయాంలో పదేళ్లలో నిర్మించిన ప్రాజెక్టులు ఎందుకు బలహీనంగా ఉన్నాయ ని ప్రశ్నించారు. 2016 నుంచి చేపట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు లోపభూయిష్టంగా నిర్మించడం వల్లనే రైతులకు శాపంగా మారిందన్నారు.

దాన్ని నిపుణుల కమిటీ అంచనా మేరకు సరిదిద్ది, తాగునీరు అందించే కార్యక్రమం తమ ప్రభుత్వం చేపట్టబోతు న్నట్టు తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తుందని ఇందులో ఏ మాత్రం డౌట్ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో, నీటి విషయంలో తమ ప్రభుత్వం లోటుపాట్లను గుర్తించి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతుందని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాణహితేొచేవెళ్ల ప్రాజెక్టులో భాగమని, దీనిని కాళేశ్వరం ప్రాజెక్టుతో అనుసంధానించి ప్రచారం చేయడం సరికాదన్నారు.

ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు, 80 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 1072.30 అడుగులు, 27.376 టీఎంసీల వద్ద నీరు నిలువ ఉందని తెలిపారు. ప్రాజెక్టులో నీటి నిల్వలను బట్టి ఆయకట్టు పంటలకు ఏ మేరకు నీటిని విడుదల చేయాలని అన్న విషయమై రెండు మూడు రోజులలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బుజ్జి పటేల్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, నిజామాబాద్‌రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు బీ వెంకటేశ్వర్లు, కిషోర్‌కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ప్రాజెక్టుల్లో పూడికతీతకు చర్యలు

 112 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యంతో నిర్మించబడిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూడిక చేరడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కడెం ప్రా జెక్టు ప్రస్తుత పరిస్థితి, నీటిమట్టం, నీటి నిల్వ సామ ర్థ్యం, సిల్టేషన్ సమస్యలు, నీటి పారుదల నిర్వహణపై మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, వివేక్‌లకు వివరించారు.

ప్రాజెక్టులో సిల్టేషన్ ప్రధాన సమస్యగా మారిందని, సుమారు 7.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులో దాదాపు 50 శాతం వరకు పూడిక పేరుకుపోయినట్లు వివరించారు. ఎస్సారెస్పీలో, కడెం ప్రాజెక్టులో పూడిక తొలగింపు ప్రక్రియను చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ విషయమై అతిత్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.