జాబ్ క్యాలెండర్ జాడేది?
నిరుద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తి
ప్రకటించిన పోస్టులన్నింటికీ నోటిఫికేషన్లు రాలే..
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగ సమస్యకు సంబంధించిన అంశమే కీలకంగా పనిచేసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ, పరీక్షల రద్దు వంటి అంశాలను ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ఉపయోగించిన కాంగ్రెస్.. అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది ‘జాబ్ క్యాలెండర్‘ విడుదల చేసి, ఉద్యోగ నియామకాలను సమయపాలనతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది.
ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చిన హామీని కాంగ్రెస్ నెరవేరస్తుందని నమ్మిన నిరుద్యోగులు గత అసెంబ్లీ ఎన్నికల్లో గంపగు త్తగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చిన ‘జాబ్ క్యాలెండర్’ను పూర్తి స్థాయిలో అమలుచేసిన దాఖలాలు కానరావడం లేదు.
వాస్తవానికి 2024 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం 2024--25 జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇందులో గ్రూప్--1, గ్రూప్--2, గ్రూప్--3, డీఎస్సీ, టెట్, పోలీస్, విద్యుత్ సంస్థలు, ఆరోగ్య శాఖ, అటవీ శాఖ, ఉన్నత విద్య తదితర విభాగాల్లో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది.
అయితే జాబ్ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్య కంటే నోటిఫికేషన్ల సమాచారానికే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ‘క్యాలెండర్ విడుదలై రెండేళ్లు అవుతున్నది.. కానీ క్యాలెండర్‌లో చెప్పిన తేదీలు, షెడ్యూల్ ఎంతవరకు అమలయ్యాయి’ అని ప్రస్తుతం నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి) : ప్రతి ఏడాది నిర్దిష్ట తేదీలతో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసి, నిర్ణీత గడువులో పరీక్షలు నిర్వహించి, నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి న ప్రభుత్వం.. ప్రకటించిన షెడ్యూల్‌ను యథాతథంగా అమలు చేయలేకపోయిందని ఆరోపణలున్నాయి. జాబ్ క్యాలెండర్‌లో పేర్కొన్న అన్ని శాఖలకు ఇప్పటికీ నోటిఫికేషన్లు వెలువడలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
కొన్ని శాఖల్లో నియామక ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, మరికొన్ని శాఖల్లో నోటిఫికేషన్లు ఆలస్యమయ్యాయని, కొన్ని ఖాళీల భర్తీపై ఇప్పటికీ స్పష్టత లేదని ప్రతిప క్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఉద్యోగాల భర్తీకి వార్షిక ప్రణాళికగా తీసుకొచ్చిన జాబ్ క్యాలెండర్ లక్ష్యం నెరవేరలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విడుదలైన నోటిఫికేషన్ల విషయంలోనూ జాప్యం మరో ప్రధాన విమర్శగా మారింది.
పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, సర్టిఫికెట్ వెరిఫికేషన్, తుది ఎంపిక, నియామక ఉత్తర్వుల జారీవరకు ప్రక్రియలు సుదీర్ఘంగా సాగుతున్నాయని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు కేసులు, రిజర్వేషన్లు, పరిపాలనా కారణాలను ప్రభుత్వం చూపుతున్నప్పటికీ.. సమయపాలనతో నియామకాలు జరగకపోవడం వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా ప్రతి ఏడాది ఒక స్థిరమైన జాబ్ క్యాలెండర్ ఉంటుందని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. 2024-25 క్యాలెండర్ తర్వాత అదే తరహాలో ప్రతి ఏడాది సమగ్ర ఉద్యోగ క్యాలెండర్ కనిపించలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది యువతకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకునే అవకాశం లేకుండా పోయిందని నిరుద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.
ఆవేదనలో నిరుద్యోగులు..
జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత ఉద్యోగ నియామకాలు వేగంగా పూర్తవుతాయని ఆశించిన నిరుద్యోగ యువతలో ఇప్పుడు నిరాశ, అసంతృప్తి పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి ఏడాది నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయని భావించి పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులు.. అనేక నియామకాల్లో జాప్యం కారణంగా భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవడం కష్టంగా మారిందని చెబుతున్నారు.
విడుదలైన నోటిఫికేషన్లలోనూ పరీక్షలు, ఫలితాలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, నియామక ఉత్తర్వుల జారీకి ఎక్కువ సమయం పడుతుండటంతో ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఒక నియామక ప్రక్రియ పూర్తికాకముందే మరో నోటిఫికేషన్‌పై స్పష్టత లేకపోవడంతో లక్షలాది మంది యువత అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారని నిరుద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.
అదే సమయంలో వయోపరిమితి, పోటీ పరీక్షలకు చేసిన ఖర్చు, కోచింగ్, కుటుంబ ఆర్థిక భారం వంటి అంశాలు కూడా అభ్యర్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెబుతున్నారు. ‘ప్రకటనలు కాదు... సమయానికి నోటిఫికేషన్లు, పరీక్షలు, నియామకాలు పూర్తి చేసే వ్యవస్థ కావాలి’ అనే డిమాండ్ నిరుద్యోగ యువత నుంచి బలంగా వినిపిస్తోంది.
హామీల అమలులో విఫలం..
ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, నిర్ణీత గడువులో ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రచారం చేసిన ప్రభుత్వం.. ప్రకటించిన అన్ని పోస్టులకు నోటిఫికేషన్లు కూడా విడుదల చేయలేకపోయిందని విమర్శిస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న అనేక నియామకాలు కూడా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గుర్తించిన ఖాళీలు, మంజూరైన పోస్టులు లేదా ప్రారంభమైన నియామక ప్రక్రియలేనని బీఆర్‌ఎస్ వాదిస్తోంది. గత ప్రభుత్వంలో జారీచేసిన నోటిఫికేషన్లు, అప్పట్లో ప్రారంభమైన రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను పూర్తిచేసి వాటినే తమ ఘనతగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తోంది.
జాబ్ క్యాలెండర్ అంటే కేవలం ఒక ప్రకటన కాదని, ప్రతి ఏడాది నిర్దిష్ట తేదీల్లో నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, నియామక ఉత్తర్వులు జారీ అయ్యే శాశ్వత వ్యవస్థ అని కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిందని బీఆర్‌ఎస్ గుర్తుచేస్తోంది. అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కాలపట్టికను పాటించకుండా, ఉద్యోగ నియామకాల్లో జాప్యానికి పాల్పడుతోందని విమర్శిస్తోంది. ఎన్నికల హామీలను అమలుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేసి ఇప్పటివరకు ఎన్ని కొత్త ఉద్యోగాలు భర్తీ చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తోంది.
సవాల్‌గా జాబ్ క్యాలెండర్..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో జాబ్ క్యాలెండర్ అత్యంత ప్రధానమైన అంశం కావడంతో.. దాని అమలు ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అధికారంలోకి రావడానికి ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉద్యోగాల భర్తీలో జాప్యం, జాబ్ క్యాలెండర్ లేకపోవడం, టీఎస్‌పీఎస్సీ వ్యవహారం వంటి అంశాలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది కచ్చితమైన కాలపట్టికతో ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చింది.
ఇప్పుడు అదే హామీ అమలుపై ప్రశ్నలు తలెత్తడంతో ప్రతిపక్షాలకు కాంగ్రెస్‌ను నిలదీయడానికి అవకాశం లభించింది. ముఖ్యంగా నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలకు మధ్య వ్యత్యాసం ఉందని ఆరోపిస్తున్నాయి.
నిరుద్యోగ యువత తెలంగాణలో కీలక ఓటు బ్యాంక్‌గా ఉండటంతో ఈ అంశం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల అంశం ప్రధాన ప్రచార అస్త్రంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే జాబ్ క్యాలెండర్ అమలు, ఉద్యోగ నియామకాల పురోగతి, ఎన్నికల హామీల అమలు వంటి అంశాలు ప్రభుత్వ రాజకీయ పనితీరును అంచనా వేసే కీలక ప్రమాణాలుగా మారుతున్నాయి.
ప్రభుత్వం చేపట్టిన ప్రధాన నియామకాలు
డీఎస్సీ 11,062 పోస్టులు
గ్రూప్--1 563 పోస్టులు
గ్రూప్--2 783 పోస్టులు
గ్రూప్--3 1,365 పోస్టులు
* ఆరోగ్య శాఖ వివిధ కేటగిరీల్లో 5 వేలకుపైగా పోస్టులు
* విద్యుత్ సంస్థలు ఏఈ, ఏఈఈ, జూనియర్ ఇంజినీర్లు తదితర పోస్టులు
* డిగ్రీ, రెసిడెన్షియల్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు
* ఇటీవల 7 వేలకు పైగా పోలీస్ నియామకాల నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అది ఇంకా దరఖాస్తు దశలోనే ఉంది.






