6 June, 2026 | 1:39 AM

నేపాల్‌తో బంధం!

06-06-2026 12:00 AM

భారత్, నేపాల్ మధ్య సంబంధాల్లో ఇటీవల కీలక పరిణామం చోటుచేసుకున్నది. హిమాలయ దేశంలో కొత్తగా కొలువైన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆఫ్ నేపాల్ అధినేత రబీ లామిచానే భారత్‌లో పర్యటించడం, ప్రధాని మోదీతో భేటీ కావడం ముదావహం. ఇరుదేశాల మధ్య గత కొంతకాలంగా దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది.

కాగా, జెన్ జీ ఉద్యమం తర్వాత నేపా ల్‌లో జాతీయవాదం బలపడటం, తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో భారత జోక్యం ఎక్కువైందన్న వాదనలు తెరపైకి రావడం తెలిసిందే. ఈ క్రమంలో లిపులేఖ్ మీదుగా మానస సరోవర్ యాత్ర చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేపాల్ నూతన ప్రధాని బాలేంద్ర షా ఇరుదేశాల మధ్య కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాల విషయంలో కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని తట్టిలేపారు.

ఈ తరుణంలో నేపాల్ అధికార పార్టీ అధ్యక్షుడి పర్యటన దౌత్యపరంగా శుభపరిణామంగానే చూడాలి. వాస్తవానికి నేపాల్ మనకు పొరుగు దేశం మాత్రమే కాదు; చారిత్రక, సాంస్కృతిక, మత, ఆర్థికపరంగా బలమైన బంధాన్ని కొనసాగిస్తున్న దేశం కూడా. అయితే, నేపాల్‌లో వచ్చిన రాజకీయ మార్పులు, చైనా ప్రభావం పెరగడం, సరిహద్దు వివాదాలు రెండు దేశాల మధ్య సంబంధాలను కొత్త మలుపు తిప్పాయి. ప్రత్యేకించి గత ఐదేళ్లలో భారత్ ప్రభావాన్ని తగ్గించి, చైనాతో సంబంధాలను విస్తరించాలనే ఆలోచన నేపాల్ పాలకుల్లో బలపడింది.

కాగా, ఆర్థికంగా, వాణిజ్యపరంగా, ఉపాధి అవకాశాలపరంగా నేపాల్ ఇప్పటికీ భారత్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నది. లక్షలాది మంది నేపాలీయులు భారత్‌లోనే ఉపాధి పొందుతు న్నారు. మరోవైపు నేపాల్‌లో ఇంధనం, సరుకు రవాణా, విద్య, వైద్యం వంటి రంగాల్లో భారత్ ఇప్పటికీ కీలకపాత్ర పోషిస్తున్నది. నేపాల్‌కు సముద్ర మార్గం, వాణిజ్యం, నిత్యావసరాల కోసం భారత్ అవసరం; అలాగే హిమాలయ ప్రాంత భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా భారత్‌కు కూడా నేపాల్ కీలకమే.

ఈ నేపథ్యంలో నేపాల్‌లోని కొత్త ప్రభుత్వం కూడా ఒకవైపు సరిహద్దు అంశాలపై దౌత్యపరంగా కఠిన వైఖరిని ప్రదర్శిస్తూనే, మరోవైపు భారత్‌తో సంబంధాలను కొనసాగించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. నేపాల్ అధికార పార్టీ అధినేత భారత పర్యటనను ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ఇరుదేశాల మధ్య రాజకీయపరంగా విభేదాలు ఉన్నప్పటికీ; చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, ప్రజల మధ్య ఉన్న బంధాలు ఈ రెండు దేశాలను పరస్పరం కట్టిపడేస్తూనే ఉంటాయని చెప్పక తప్పదు.