ఎండ కాదు, రేపటికి మండే గుండె
వేసవి వచ్చిందంటే ఎండలు, ఉక్కపోత, చెమటలు సహజమేనని మనం భావిస్తాం. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అనుకుంటాం. కానీ, నేటి పరిస్థితుల్లో హీట్ వేవ్‌ను అలా తేలికగా తీసుకోవడం సాధ్యం కాదు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ), జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) పదేపదే చెబుతు న్న హెచ్చరిక ఇదే. హీట్ వేవ్ ఇప్పుడు కేవ లం వాతావరణ సమస్య కాదు. అది ప్రజారోగ్య సంక్షోభం మాత్రమే కాదు. అది దేశ ఆర్థిక వ్యవస్థను, శ్రమశక్తిని, ఉపాధిని, ఉత్పాదకతను ప్రభావితం చేస్తున్న నెమ్మదిగా విస్తరిస్తున్న ఒక విపత్తు.
నేటి భారతదేశంలో హీట్ వేవ్ అంటే కేవలం పెరిగిన ఉష్ణోగ్రత కాదు, అది ఉపాధి, ఉత్పాదకత, ఆర్థిక స్థిరత్వంపై కనిపించకుండా పడుతున్న సమ్మెటపోటన్న విషయాన్ని మనం వీలైనంత త్వరగా గ్రహించాలి. హీట్ వేవ్ ప్రభావాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, దాని తీవ్రతను గణనీయంగా తగ్గించడం మాత్రం సాధ్యమే.
హీట్ వేవ్ అంటే గతంలో కొన్ని రోజులపాటు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం మాత్రమే. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వేడి తీవ్రత పెరుగుతోంది. వేడి రోజుల సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు, రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం కొత్త సమస్యగా మారింది. భారత వాతావరణ శాఖ దీనిని ‘వార్మ్ నైట్’ గా గుర్తిస్తోంది. పగలు వేడి, రాత్రి కూడా వేడి కలిసొస్తే మానవ శరీరానికి విశ్రాంతి దొరకదు. దాని ప్రభావం మరుసటి రోజు పనితీరుపై పడుతుంది. ఇక్కడే హీట్ వేవ్‌కు సంబంధించిన ఆర్థిక కోణం మొదలవుతుంది.
భారతదేశంలో లక్షలాది మంది రోజువారీ కూలీలే ఉంటారు. నిర్మాణరంగ కార్మి కులు, వ్యవసాయ కూలీలు, రోడ్లపై వ్యాపా రం చేసేవారు, డెలివరీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, మున్సిపల్ కార్మికులు, చిన్న వ్యాపారుల జీవనం నేరుగా బహిరంగ వాతా వరణంపై ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత 44 లేదా 45 డిగ్రీలకు చేరుకున్నప్పుడు వారు ఎనిమిది గంటలు పనిచేయలేరు. నాలుగు లేదా ఐదు గంటలకే పరిమితం కావాల్సి వస్తుంది. అంటే వారి ఆదాయం కూడా అదే స్థాయిలో తగ్గిపోతుంది.
హీట్ వేవ్ ప్రభావం మొదట ఆరోగ్యంపై కనిపిస్తుంది. కానీ, చివరికి అది ఆదాయంపై పడుతుంది. ఆదాయం తగ్గితే వినియోగం తగ్గుతుంది. వినియోగం తగ్గితే స్థానిక ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అందుకే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) వంటి సంస్థలు కూడా వేడి ప్రభావాన్ని ఆర్థిక ప్రమాదంగా పరిగణిస్తున్నాయి. ఎన్‌డీఎంఏ నిపుణులు చెబుతు న్న ఒక అంశాన్ని ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా గమనించాలి. హీట్ వేవ్ ప్రభా వం కేవలం ఆరోగ్యంపైనే కాదు, ప్రొడక్టివిటీపై కూడా పడుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.
అదే అసలు సమస్య. ఎందుకం టే ఏ దేశ ఆర్థికాభివృద్ధికైనా శ్రమశక్తే మూలధనం. ఆ శ్రమశక్తి పనిగంటలు తగ్గిపోతే ఉత్పాదకత కూడా తగ్గిపోతుంది. వ్యవసాయరంగంలో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. రైతులు, వ్యవసాయ కూలీలు ఎండలో పనిచేయాల్సిందే. కానీ, ఇప్పుడు మధ్యాహ్న సమయంలో పని చేయడం ప్రమాదకరంగా మారుతోంది. ఫలితంగా వ్యవసాయ పనుల సమయ పట్టిక మారుతోంది. కొన్నిచోట్ల దిగుబడులపై కూడా ప్రభావం కనిపిస్తోంది. నీటి అవసరాలు పెరుగుతున్నాయి. సాగు ఖర్చులు పెరుగుతున్నాయి.
నిర్మాణరంగం పరిస్థితి కూడా భిన్నంగా లేదు. పెద్ద పెద్ద నగరాల్లో జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలు వేలాది మంది కూలీల శ్రమపై ఆధారపడి ఉంటాయి. వేడి కారణంగా పనిగంటలు తగ్గడం, ఆరోగ్య సమస్యలు పెరగడం, వైద్య ఖర్చులు పెరగడం.. ఇవన్నీ నిర్మాణ వ్యయాలను పెంచు తున్నాయి. హీట్ వేవ్ ప్రభావం నగరాల్లో మరింత సంక్లిష్టంగా ఉంటుంది.
ఒకవైపు ప్రజలు ఎక్కువసేపు ఇళ్లలో ఉండటానికి ప్రయత్నిస్తారు. మరోవైపు ఎయిర్ కండీషనర్లు, కూలర్ల వినియోగం పెరుగుతుంది. విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతుం ది. విద్యుత్ వినియోగం పెరిగితే పంపిణీ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు కూడా పెరుగుతాయి.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాల పాత్ర కేవలం హెచ్చరికలు జారీచేయడానికే పరిమితం కావడం సరిపోదు. ఎన్‌డీఎంఏ రూపొందిస్తున్న హీట్ యాక్షన్ ప్లాన్లు ఎందుకు ముఖ్యమో ఇక్కడ అర్థమవుతుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, కార్మిక ప్రాంతాల్లో నీడ, తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదు; అది ఆర్థిక నష్టాన్ని తగ్గించే చర్య కూడా.
ఇటీవల 16వ ఆర్థిక సంఘం హీట్ వేవ్ ను ప్రత్యేక విపత్తుగా గుర్తించే అంశాన్ని ప్రస్తావించడానికి కారణం కూడా ఇదే. ఒకసారి హీట్ వేవ్‌ను అధికారిక విపత్తుగా గుర్తిస్తే దానికి సంబంధించిన నిధులను మరింత సమర్థంగా వినియోగించే అవకా శం ఉంటుంది. రాష్ట్రాలు ముందస్తు చర్యలకు పెట్టుబడులు పెట్టగలుగుతాయి.
మరో ముఖ్యమైన అంశం సమాచార వ్యవస్థ. భారత వాతావరణ శాఖ ఇప్పుడు 15 రోజు ల ముందే అంచనాలు ఇస్తోంది. మొబైల్ ఫోన్లు, యాప్‌లు, కామన్ అలర్ట్ ప్రొటోకాల్ ద్వారా హెచ్చరికలు పంపుతోంది. ఒక రైతు, ఒక కూలీ, ఒక చిన్న వ్యాపారి ముందుగానే సమాచారం తెలుసుకుంటే తన పనిని ప్రణాళికాబద్ధంగా మార్చుకోగలడు. సమాచార మే నష్టాన్ని తగ్గించే ఆయుధంగా మారుతుంది.
వాతావరణ మార్పు ప్రభావాలు భవిష్యత్తు సమస్యలు కావు. అవి వర్తమాన వాస్తవాలు. హీట్ వేవ్ ఇప్పుడు ప్రతి వేసవిలో తిరిగి వస్తున్న అతిథి కాదు; అది ప్రతి సంవత్సరం మరింత బలపడుతున్న సవా లు. దాన్ని కేవలం ‘ఎండ ఎక్కువగా ఉంది’ అనే స్థాయిలో చూడడం సరిపోదు. ఎందుకంటే హీట్ వేవ్ వల్ల చనిపోయే వ్యక్తి సంఖ్య మాత్రమే కథ కాదు. పనిచేయలేక ఆదా యం కోల్పోయిన కూలీ కూడా అదే కథలో భాగం. సాగు ఖర్చులు పెరిగిన రైతు కూడా అదే కథలో భాగం. విద్యుత్ బిల్లు పెరిగిన మధ్యతరగతి కుటుంబం కూడా అదే కథలో భాగం.
అందుకే హీట్ వేవ్‌ను వాతావరణ శాస్త్రం పరిధిలో మాత్రమే కాక, ఆర్థిక శాస్త్రం పరిధిలో కూడా చూడాల్సిన సమయం వచ్చింది. ఎండ తీవ్రతను థర్మామీటర్ కొలుస్తుంది. కానీ, దాని ఆర్థిక ప్రభావాన్ని కొలిచేది ప్రజల జీవనోపాధి. అందుకే నేటి భారతదేశంలో హీట్ వేవ్ అంటే కేవలం పెరిగిన ఉష్ణోగ్రత కాదు, అది ఉపాధి, ఉత్పాదకత, ఆర్థిక స్థిరత్వంపై కనిపించకుండా పడుతున్న సమ్మెటపోటన్న విషయాన్ని మనం వీలైనంత త్వరగా గ్రహించాలి.
హీట్ వేవ్ ప్రభావాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, దాని తీవ్రతను గణనీయంగా తగ్గించడం మాత్రం సాధ్యమే. ఇందుకోసం ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, పౌరసమాజం సమన్వయంతో పనిచేయాలి. పట్టణాలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున వృక్షారోపణ చేపట్టడం అత్యవసరం.
ఒక్క పెద్ద చెట్టు తన చుట్టుపక్కల ఉష్ణోగ్రతను 2 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చెరువులు, కుంటలు, నీటి వనరులను సంరక్షించడం, వర్షపు నీటి సంరక్షణను ప్రోత్సహించడం, భవనాలపై రూఫ్ గార్డెన్లు, కూల్ రూఫ్‌లను ప్రోత్సహించడం ద్వారా పట్టణాల్లో హీట్ ఐలాండ్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. నిర్మాణ, వ్యవసాయ రంగం, రోజువారీ కూలీల పనివేళలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సవరించాలి. బస్టాండ్లు, మార్కెట్లు, కార్మిక కూడళ్లు, పాఠశాలల వద్ద నీడ, తాగునీరు, విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
అదే సమయంలో ప్రతి పౌరుడు కనీసం ఒక చెట్టును నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకుంటే అది పర్యావరణానికి మాత్రమే కాదు, భవిష్యత్ తరాల ఆరోగ్యానికి కూడా పెట్టుబడిగా మారుతుంది. హీట్ వేవ్‌ను ఎదుర్కోవాలంటే కేవలం ఎయిర్ కండీషనర్ల సంఖ్య పెరగడం కాదు; చెట్ల సంఖ్య పెరగాలి, పచ్చదనం విస్తరించాలి, ప్రకృతితో సమతుల్యమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. ఎవరికి వారుగా అవగాహన పెంచుకుని, మన వంతు బాధ్యతగా పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేయాలి.
వ్యాసకర్త: మల్లాది వేంకట గోపాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్






