భారత్‌కు ప్రతిష్ఠ.. చిదంబరంలో కలవరం
- అవగాహన లోపం
బ్రిక్స్ వ్యాఖ్యలపై బీజేపీ నేత రామ్ మాధవ్ కౌంటర్
చెన్నై, సెప్టెంబర్ 10: ప్రపంచదేశాల్లో భారత్‌కు పెరుగుతున్న ప్రతిష్ఠ చూసి ప్రతిపక్ష పా ర్టీలు కలవరపడిపోతున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ (BJP National Vice President Ram Madhav) ఆరోపించారు. గురువారం చెన్నైలో జరిగిన ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. నూతన ప్రపంచ క్రమంలో భారతదేశం సమతుల్య పాత్ర ఎందుకు పోషించాల్సి ఉంటుందో వివరించారు.
బ్రిక్స్ సదస్సుపై చిదంబరం చేసి న వ్యాఖ్యలు ఆయనలోని అసంతృప్తిని బహిర్గతం చేశాయన్నారు. నాలుగోసారి బ్రిక్స్ సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడం వల్ల ప్రపంచదేశాల్లో దేశ ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి అత్యున్నత ప్రపంచ వేదికల ప్రాముఖ్యతను కొట్టిపారేయడం ఆయనలోని అవగాహన లోపంగా అభివర్ణించారు. విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి నోటీ నుంచి ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు రావడం ఆశ్చర్యకరమన్నారు.
బ్రిక్స్ కూటమి చిన్నదేం కాదని, ప్రపంచ జనాభాలో 45 శాతం, అత్యధిక వృద్ధిరేటు కలిగిన 10 దేశాలు ఉన్నాయని వివరించారు. మారుతున్న ప్రపంచక్రమంలో ఒకేవేదికపైకి అత్యున్నతస్థాయి నాయకులు వచ్చి చర్చించడం సామాన్యమైన విషయమేం కాదన్నారు.
ఈ సమావేశంతో దేశాల సాంప్రదాయ అధికార సమీకరణాలు మారతాయని, నూతన నిర్ణయాల దిశగా ముందుకు సాగుతాయని చెప్పారు. పోటీతత్వ ప్రపంచంలో భిన్నమైన ఆలోచనలకు బ్రిక్స్ వేదిక కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా తీరుతో దాని ప్రభావం తగ్గుతున్న తరుణంలో బ్రిక్స్ దేశాల కూటమి సమావేశం పెద్ద పాత్ర పోషించగలదన్నారు.