పత్తికి బ్రేక్.. మిరపకు జై!
- ఇటిక్యాల మండలంలో మారిన పంటల సరళి
- పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవడంతో
- ప్రత్యామ్నాయంగా మిరప, కంది వైపు రైతుల మొగ్గు
ఇటిక్యాల, జూలై 19 :ఒకప్పుడు తెల్లబంగారంగా పేరొందిన పత్తి పంటతో కళకళలాడిన ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని పొలాలు ఈ ఏడాది కొత్త రూపు దాల్చుతున్నాయి. వరుసగా ఎదురవుతున్న వాతావరణ ప్రతికూల పరిస్థితులు, పెరుగుతున్న సాగు ఖర్చులు, ఆశించిన దిగుబడి లేకపోవడం, మార్కెట్లో ధరల అనిశ్చితి కారణంగా రైతులు పత్తికి దూరమవుతున్నారు. ప్రత్యామ్నాయంగా మిరప, కంది వంటి పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు.
ముఖ్యంగా బావులు, బోరు బావుల ఆధారంగా సాగు చేసే రైతులు మిరప సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో మిరప నారుమడుల పెంపకం ముమ్మరంగా కొనసాగుతోంది. ఎత్తున బెడ్లపై నాణ్యమైన విత్తనాలతో నారు పెంచుతూ, ప్రధాన పొలాల్లో నాటేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
బెడ్లపై సందడిగా నారుమడులు
మిరప సాగుకు అనువుగా ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేసి రైతులు నారు పెంచుతున్నారు. నీటి నిర్వహణ, మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుతం నారు ఆరోగ్యంగా పెరుగుతుండటంతో రానున్న రోజుల్లో మండలంలో మిరప సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పత్తిపై తగ్గిన నమ్మకం
గత కొన్నేళ్లుగా పత్తి సాగులో రైతులు ఆశించిన ఫలితాలు పొందడం లేదు. అధిక పెట్టుబడులు, తెగుళ్ల బెడద, అస్థిర వాతావరణం, మార్కెట్లో ధరల ఒడిదుడుకులతో పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో ఈసారి రిస్క్ తగ్గించి ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారిస్తున్నారు.
మిరపతోనే ఆశలు
మిరప పంటకు ప్రారంభంలో పెట్టుబడి ఎక్కువైనా, దిగుబడి బాగుంటే మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉండటంతో రైతులు ఆశాభావంతో ఉన్నారు. అయితే మార్కెట్ ధరలు అనుకూలంగా ఉండడంతో పాటు తెగుళ్ల నివారణకు ప్రభుత్వం సకాలంలో సాంకేతిక సలహాలు, అవసరమైన మద్దతు అందించాలని రైతులు కోరుతున్నారు.
వ్యవసాయ శాఖ సూచన
మిరప సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ధ్రువీకరించిన విత్తనాలను ఉపయోగించడంతో పాటు, నారు దశ నుంచే తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తే మెరుగైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
గిట్టుబాటు వస్తుందనే ఆశతో ఉన్నాం
ఏడాది పొడవునా కష్టపడినా పత్తి పంటతో పెట్టుబడులు కూడా వచ్చేలా లేవు. వాతావరణం సహకరించడం లేదు. అందుకే ఈసారి ధైర్యం చేసి మిరప వైపు మళ్లాం. బావుల వద్ద నారు పోశాం. మొక్కలు బాగానే వస్తున్నాయి. మార్కెట్ అనుకూలంగా ఉండి, తెగుళ్లు సోకకుండా ఉంటే ఈసారి మిరపతోనే కాస్త గిట్టుబాటు వస్తుందనే ఆశతో ఉన్నాం.
- ప్రతాప్ నాయుడు, స్థానిక రైతు, ధర్మవరం గ్రామం






