21 July, 2026 | 8:17 AM

నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్

20-07-2026 06:35 PM

ఆలేరు,(విజయక్రాంతి): నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని పీవైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్ డిమాండ్ చేశారు. ఆలేరు పట్టణంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో జరిగిన పీవైఎల్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ లీకేజీతో 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, వారికి న్యాయం చేయాలన్నారు.

బీజేపీ ప్రభుత్వం వచ్చాక 90కి పైగా పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ఆరోపించారు. సోనమ్ వాంగ్‌చుక్ పిలుపుతో చలో పార్లమెంట్ కు వెళ్తున్న యువకులపై ఢిల్లీలో పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు న్యాయం చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు మారుజొడు సిద్దేశ్వర్, ప్రధాన కార్యదర్శి సాదుల శ్రీకాంత్, నాయకులు నాగరాజు, వెంకటేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.