21 March, 2026 | 12:10 PM

పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ఊసేలేని బడ్జెట్

21-03-2026 01:29 AM

వరంగల్,  మార్చి 20 (విజయక్రాంతి): జనాకర్షక పథకాలకే తప్ప ప్రస్తుత వ్యవస్థను బాగుచేసే విధంగా విద్యారంగానికి కేటాయింపులు లేవని, 2026, 27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన 3,24,234 కోట్ల బడ్జెట్ లో విద్య, మానవ వనరులకు కేటాయించింది కేవలం 26,674 కోట్లు అని, ఇది మొత్తం బడ్జెట్లో 8.2 శాతం మాత్రమేననీ, ఉదయం అల్పాహారం,

ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఆహ్వానించిందగిందే అయినా గత సంవత్సరం కంటే రూ 3,566 కోట్లు అదనంగా కేటాయించినప్పటికీ పెంచిన మొత్తం బ్రేక్ ఫాస్ట్, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజన పథకం విస్తరణ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు కోసమే సరిపోవచ్చని టిఎస్ యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్ లింగారావు అన్నారు.

అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల గురించి, మధ్యాహ్నభోజనం నాణ్యత పెంపుగురించి అదనపు నిధుల కేటాయింపు గురించి ప్రస్తావన లేదని,  గత సంవత్సరం 7.58 శాతం కేటాయించగా, ఈ సంవత్సరం 8.22 శాతం కేటాయించారని, విద్యకు 15 శాతం కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ వరుసగా 3వ బడ్జెట్లో కూడా నెరవేరలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను సమీక్షించి కనీసం 15 శాతం కేటాయించాలని లింగారావు పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి 1,056 కోట్లు కేటాయింపును స్వాగతిస్తున్నామని,  మరి పీఆర్సీ సంగతేంటని ప్రశ్నించారు.

రెండో పీఆర్సీ అమలు గురించి గానీ, పెండింగ్ బిల్లులు, పెండింగ్ డీఎల కోసం ,2024 మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు గురించిగానీ బడ్జెట్ లో మాట మాత్రంగానైనా ప్రస్తావించకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయులను నిరాశకు గురిచేసిందన్నారు. ఇప్పటికే పీఆర్సీ అమలు 33 నెలలు ఆలస్యమైందని,

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మంచి పీఆర్సీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని 27 నెలలు గడుస్తున్నా నిలబెట్టుకోకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ, పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్లులు, పెండింగ్  బకాయిల గురించి, ఉద్యోగ విరమణ పొందిన పెన్షన్ దారుల  పెన్షన్ బకాయిలపై కూడా స్పష్టత ఇవ్వాలని లింగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.