రోడ్డు ప్రమాదాల నివారణకు సమష్టి కృషి అవసరం
కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, మే 25 (విజయక్రాంతి) : జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా జిల్లా స్థాయి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ వినియోగించాలన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.జిల్లాలో ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రోడ్లపై హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జెడ్పీ సి ఈ వో ఎల్లయ్యా,, ఆర్ & బీ శాఖ అధికారి వేణు, జిల్లా వైద్య అధికారి శ్రీరామ్, డి ఎస్పీ లు, జాతీయ రహదారి అధికారులు ,రవాణా శాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లుపాల్గొన్నారు.






