1 August, 2026 | 8:36 PM

ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

01-08-2026 07:59 PM

ముర్రుపాల ప్రాముఖ్యతపై అవగాహన

గర్భిణీలు, బాలింతలకు సూచనలు

కల్లూరు,(విజయక్రాంతి): ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా చెన్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని రావికంపాడు, కుమ్మరిగూడెం అంగన్వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఆగస్టు 1 నుంచి 7 వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమానికి చిన్నకోరుకొండి సూపర్వైజర్ వెంకటమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ప్రసవం అనంతరం వెంటనే శిశువుకు ముర్రుపాలు పట్టించే అవసరం గురించి వివరించారు.ముర్రుపాలలో సమృద్ధిగా పోషక విలువలు ఉండటంతో పాటు తల్లి,శిశువుల మధ్య అనుబంధాన్ని పెంపొందిస్తాయని,శిశువును అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయని తెలిపారు.బిడ్డకు కనీసం ఆరు నెలల పాటు తల్లిపాలే ఇవ్వాలని, ఈ సమయంలో ఎలాంటి ఘనాహారం ఇవ్వకూడదని సూచించారు.

డబ్బా పాలు వల్ల కలిగే అనర్థాలను కూడా వివరించారు.కార్యక్రమంలో భాగంగా గ్రామ పోషణ ఆరోగ్య దినోత్సవం నిర్వహించి,గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల బరువు, ఎత్తు కొలిచారు.హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు అందించారు. పిల్లలకు చేతులు శుభ్రంగా కడుక్కోవడం (హ్యాండ్‌వాష్) విధానాన్ని నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అప్పారావు, పీహెచ్ఎన్ కనకదుర్గ, ఏఎన్ఎంలు సునీత, విజయలక్ష్మి, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు ఝాన్సీ, పద్మాకుమారి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు, పిల్లలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.